నారాయణలో చేర్పించొద్దు

28 Mar, 2017 02:55 IST|Sakshi
నారాయణలో చేర్పించొద్దు

సదుం: పదో తరగతి పూర్తయిన విద్యార్థులను నారాయణ కళాశాలలో చేర్పించవద్దంటూ వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు సోమవారం సదుంలో కరపత్రాలు పంచారు. ఆరు నెలల కాలంలో తిరుపతి నారాయణ విద్యాసంస్థల్లో 13 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. కళాశాలలో విద్యార్థులను వేధింపులకు, ఒత్తిడికి గురుచేస్తుండటమే ఇందుకు కారణమన్నారు.

ఎంతో మంది మధ్యతరగతి కుటుంబాల వారు తమ బిడ్డల ఉజ్వల భవిష్యత్తు కోసం లక్షలాది రూపాయలు అప్పు చేసి మంచి చదువులు చదివించాలని ఆశపడితే, వారి ప్రాణాలు హరించేలా విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రవర్తించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ విద్యార్థి విభాగం జిల్లా సంయుక్త కార్యదర్శి బావాజీ, పుంగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మదన్‌ పాల్గొన్నారు.

నారాయణ విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలి
రొంపిచెర్ల: విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకుంటున్న నారాయణ విద్యా సంస్థల గుర్తింపును ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఎన్‌ఎస్‌యూఐ జిల్లా ఉపాధ్యక్షుడు వసీం అక్రమ్‌ డిమాండ్‌ చేశారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థల్లో వేధింపుల వల్లే విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర మంత్రిగా ఉన్న నారాయణ నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలన్నారు.

ఒక ఏడాదిలోనే నారాయణ విద్యా సంస్థల్లో 14 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. విచారణ చేపట్టి, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తిరుపతి నారాయణ విద్యా సంస్థలో సోమవారం కూడా ఒక విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయాన్ని గుర్తు చేశారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరగకపోతే డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు