భారత జాతీయ జెండా విశ్వకేతనం ఘనత ఇస్రోదే

28 Apr, 2016 19:34 IST|Sakshi
భారత జాతీయ జెండా విశ్వకేతనం ఘనత ఇస్రోదే

శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత క్షేత్రీయ దిక్సూచి వ్యవస్థ (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్) సిరీస్‌లో ఏడో నావిగేషన్ ఉపగ్రహాన్ని గురువారం విజయవంతంగా ప్రయోగించి అంతరిక్ష విజయాల వినువీధిలో భారత జాతీయ త్రివర్ణ పతాకాన్ని విశ్వకేతనం చేసిన ఘనత ఇస్రో శాస్త్రవేత్తలకే దక్కిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీస్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు ప్రయోగించి పీఎస్‌ఎల్‌వీ సీ33 ప్రయోగాన్ని ఆయన న్యూఢిల్లీ నుంచి తిలకించారు.

వాస్తవంగా ప్రయోగాన్ని స్వయంగా వీక్షించి, నావిగేషన్ సిస్టంను జాతికి అంకింతం చేయడానికి విచ్చేస్తారని ప్రచారం జరిగింది. ఆయన రాలేకపోవడంతో ప్రయోగం విజయవంతం కాగానే న్యూఢిల్లీ నుంచి ఇస్రో శాస్త్రవేత్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఇది ఇస్రో చేసిన ప్రయోగాల్లో చరిత్రాత్మకమై ఘట్టమని, దీన్ని యజ్ఞంలా తీసుకుని ఏడు నావిగేషన్ ఉపగ్రహాలను వరుసగా దిగ్విజయంగా ప్రయోగించినందుకు అందరికీ అభినందనలు తెలిపారు.

దేశవ్యాప్తంగా ఉపగ్రహ ప్రయోగాలతో సాంకేతిక విప్లవం వచ్చిందని, వాటి ఫలితాలు సామాన్యుడికి సైతం అందుతున్నాయన్నారు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఐదు దేశాలకు మాత్రం వివిధ రకాల పేర్లుతో నావిగేషన్ సిస్టం ఉందని, పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నావిగేషన్ సిస్టం అభివృద్ధి చేసుకున్న ఆరో దేశంగా నేడు భారత్ అవిర్భవించిందని చెప్పారు.
నావిగేషన్ సిస్టం అంటే నేడు సామాన్య మానవుడికే కాకుండా సముద్రంలో చేపలు పట్టుకునే మత్స్యకారులు నుంచి విమానాలు, నౌకలు నడిపే పైలైట్లు, కెప్టెన్ వరకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటారన్నారు. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు అవి ఎక్కడ జరిగాయో గుర్తించి వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా ఇది దోహదపడుతుందని వివరించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎలాంటి ప్రమాదాలు జరిగినా, ఇతరత్రా ఉపద్రవాలు జరిగినా గుర్తించి సమాచారం అందిస్తుందన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా సముద్రంలో తిరిగే ఓడలకు దిశా నిర్దేశాన్ని అందజేస్తుందన్నారు.

భూమిమీద తిరిగే వాహనాలు, రైళ్లు, ఆకాశంలో తిరిగే విమానాలకు, నీటిపై తిరిగే ఓడలకు దిక్సూచి వ్యవస్థను అందించడమే కాకుండా సామాన్య మానవుడు వాడుకునే ఆండ్రాయిడ్ ఫోన్లలో నావిగేషన్ సిస్టంను అందిస్తుందని చెప్పారు. మరో రెండు, మూడు నెలల్లో ప్రతి ఒక్కరి చేతిలో నావిగేషన్ సిస్టం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. సాంకేతిక ఫలితాలు పేదా గొప్ప తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అందజేయాలనే భారత ప్రభుత్వం లక్ష్యం నేరవేరుతోందని అన్నారు. అందుకే దీన్ని జాతికి అంకింతం చేస్తున్నామని మోదీ చెప్పారు. ఇస్రో శాస్త్రవేత్తలు పదేళ్లు శ్రమించి నావిగేషన్ సిస్టంను తయారు చేసినందుకు వారికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.

మరిన్ని వార్తలు