క్వార్టర్స్‌కు నార్పల, మడకశిర

12 Feb, 2017 21:35 IST|Sakshi
క్వార్టర్స్‌కు నార్పల, మడకశిర

- అనంత ప్రీమియర్‌ లీగ్‌ పోటీల్లో సత్తా
అనంతపురం సప్తగిరిసర్కిల్‌ : జిల్లా క్రికెట్‌ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీటీ సహకారంతో స్థానిక అనంత క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న అండర్‌–16 బాలుర అనంత ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ పోటీలు ఆదివారం రసవత్తరంగా సాగాయి. క్రికెట్‌ పోటీల్లో నార్పల, మడకశిర జట్లు నాకౌట్‌ స్థాయి నుంచి క్వార్టర్‌కు చేరాయి. కాగా ఇప్పటికే ఆర్డీటీ అకాడమీ, కదిరి, ఆత్మకూరు, ధర్మవరం, గుంతకల్లు, కణేకల్లు జట్లు క్వార్టర్స్‌కు చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నార్పల, మడకశిర జట్లు క్వార్టర్స్‌కు చేరాయి.

మ్యాచ్‌ వివరాలు
విన్సెంట్‌ క్రీడా మైదానంలో పెనుకొండ, నార్పల జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన నార్పల జట్టు 38.3 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌటైంది. జట్టులో విజయకృష్ణ (73) రాణించారు. పెనుకొండ బౌలర్లు బాబా ఫకృద్దీన్‌, ఖాదర్‌ తలా 4 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పెనుకొండ జట్టు 26.3 ఓవర్లలో 77 పరుగులకే కుప్పకూలింది. నార్పల జట్టు బౌలర్లు లక్ష్మీకాంత్‌ 4, విష్ణువర్ధన్‌ 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

అదేవిధంగా బీ గ్రౌండ్‌లో ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ మడకశిర, తాడిపత్రి జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన మడకశిర జట్టు 42 ఓవర్లలో 227 పరుగులు చేసింది. జట్టులో భీమానాయక్‌ (61), అల్తాఫ్‌ (51) అర్ధశతకాలతో రాణించారు. తాడిపత్రి జట్టులో రమేష్‌ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన తాడిపత్రి నిర్ణీత 45 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసి ఓడింది. జట్టులో లక్ష్మణ్‌కుమార్‌ (96) త్రుటితో సెంచరీ మిస్సయ్యాడు. వచ్చే ఆదివారం క్వార్టర్స్‌ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్టు జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి బీఆర్‌ ప్రసన్న తెలిపారు.

క్వార్టర్స్‌ మ్యాచ్‌ల వివరాలు
కదిరి–నార్పల
ధర్మవరం–ఆత్మకూరు
గుంతకల్లు–కణేకల్లు
ఆర్డీటీ అకాడమీ–ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ మడకశిర

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు