నాటకం..రసాత్మకం

14 May, 2017 23:40 IST|Sakshi
నాటకం..రసాత్మకం
- కర్నూలులో జాతీయ స్థాయి నాటిక పోటీలు ప్రారంభం
కర్నూలు(హాస్పిటల్‌): నాటకాలను ప్రజలు ఆదరించాలని, అప్పుడే కళాకారులకు మనుగడ ఉంటుందని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. టీజీవీ కళాక్షేత్రంలో స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం జాతీయ స్థాయి నాటిక పోటీలను జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటకం రసాత్మకమైనదన్నారు. అయితే దీనిని ఆదరణ తగ్గడం ఆవేదన కలిగిస్తోందన్నారు. 11 సంవత్సరాల నుంచి లలిత కళాసమితి నాటకాలను ప్రోత్సహిస్తూ నగర ప్రజలకు వినోదాలను అందిస్తోందని తెలిపారు. ఈ నాటికలు సకుటుంబ సమేతంగా చూడదగ్గవిగా ఉన్నాయన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ రవీంద్రబాబు మాట్లాడుతూ.. కావ్యం రెండు రకాలని, ఒకటి దృశ్య, రెండోది శ్రవ్య కావ్యమన్నారు. ఈ నాటికలు శ్రవ్య నాటికలని చెప్పారు. ఇవి చక్కటి సందేశాలను ఇచ్చే విధంగా ఉన్నాయని కొనియాడారు. అనంతరం నాటిక దర్శకులు శ్రీజ సాదినేని, భాస్కర్‌నాయక్‌లను సన్మానించారు. కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య, సభ్యులు డి. ఈశ్వరయ్య, శ్రీనివాసరావు, క్రిష్టఫర్, టీవీ రెడ్డి పాల్గొన్నారు. 
 
డబ్బు విలువ తెలిపే సందడే సందడి
శ్రీ జయ ఆర్ట్స్‌(హైదరాబాద్‌) వారి సందడే సందడి నాటిక విశేషంగా ఆకట్టుకుంది. శ్రీజా సాదినేని రచన, దర్శకత్వం వహించిన ఈ నాటికలోని ఇతి వృత్తం ఇది. సులభంగా డబ్బు సంపాదించాలని ముందు, వెనకా ఆలోచించకుండా ప్లాట్లు, ఫ్లాట్లు కొనేయడం,,రిజిస్టర్‌ కాని చిట్‌ఫండ్‌ కంపెనీల్లో, మోసపూరితమైన బ్యాంకుల్లో ధనాన్ని పెట్టడం ఎంత ప్రమాదమో ఈ నాటిక వివరిస్తుంది. దైనందిక జీవితంలో టీవీని ఒక ప్రధాన భాగంగా మార్చుకున్న సుశీల తన భర్తను రకరకాలుగా ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటుంది. భార్యపై పిచ్చి ప్రేమతో ఆమె భర్త చంద్రశేఖర్‌ ఆమె మాటను కాదనలేడు. సుశీల తమ్ముడు భగవాన్‌ తన తెలివితేటలతో అక్కను, భావను ఎలా మార్చాడన్నదే ఈ కథ. హాస్య ప్రదానంగా సాగే కథనం సామాజిక ఇతివృత్తాన్ని చాపకింద నీరులా నడిపిస్తుంది. 
 
భారతీయ వివాహ వ్యవస్త గొప్పతనాన్ని తెలిపే సప్తపది
శ్రీ అంజన రాథోడ్‌ థియేటర్స్‌ వారి సప్తపది నాటిక భారతీయ సంస్కృతిలో వివాహ వ్యవస్థ గొప్పతనం గురించి చెబుతుంది. తాళాబత్తుల వెంకటేశ్వరరావు ఈ నాటికను రచించారు. బలహీనమైన ఆలోచనలతో, చిన్న చిన్న కారణాలతో విడాకుల పేరుతో విలువైన వైవాహిక జీవితాన్ని భగ్నం చేసుకుంటున్నారని, మన వివాహ వ్యవస్థ ఔన్నత్యాన్ని, సప్తపదుల పవిత్రత మహోన్నతమైనవని గుర్తు చేస్తూ ఈ నాటిక సాగుతుంది. నేటితరం సప్తపదుల సాక్షిగా చేసిన వాగ్దానాన్ని గౌరవిస్తూ, వైవాహిక జీవితాన్ని ఆనందంగా సాగిస్తూ ఆదర్శదంపతులుగా వర్దిల్లాలని సందేశమిచ్చేదే ఈ నాటిక సారాంశం. 
 
మరిన్ని వార్తలు