నేతన్నలను ఆదుకుంటాం

8 Aug, 2017 23:48 IST|Sakshi
నేతన్నలను ఆదుకుంటాం

రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న 
జిల్లా పరిషత్‌లో జాతీయ చేనేత దినోత్సవం


ఆదిలాబాద్‌అర్బన్‌: తెలంగాణ ప్రభుత్వం నేతన్నలను ఆదుకునేలా చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పట్టణంలోని కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి మొక్కలు నాటారు. అనంతరం అక్కడి నుంచి జిల్లా పరిషత్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించడంతోపాటు రుణాలు మాఫీ చేసినట్లు చెప్పారు.

పాఠశాలలు, వసతిగృహాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థుల యూనిఫారాల కోసం చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇచ్చామన్నారు. చేనేత కార్మికుల కోసం బడ్జెట్‌లో రూ.1,286 కోట్లు కేటాయించడం, కులవృత్తుల వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి పరిశ్రమల స్థాపనకు రుణాలు, భూములు ఇవ్వడం జరుగుతుందన్నారు. చేనేత వస్త్రాలను ధరించిన పాత రోజులు మళ్లీ పునరావృతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్‌ ఎం.జ్యోతిబుద్ధ ప్రకాశ్‌ మాట్లాడుతూ జిల్లాలో చేనేత ఉత్పత్తులు లేకున్నా మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు. సాంకేతిక పరంగా అభివృద్ధి చెంది పవర్‌లూమ్స్‌ రావడంతో హ్యాండ్లూమ్స్‌ కొంత మేరకు తగ్గిందన్నారు.

ఇండియా చేనేత ఉత్పత్తులకు ఇతర దేశాల్లో మంచి గీరాకీ ఉందన్నారు. జిల్లా స్థాయిలో చేనేత కార్మికులను ఆదుకుంటామన్నారు. హ్యాండ్లూమ్‌కు మంచి భవిష్యత్‌ వస్తుందన్నారు. అనంతరం బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రంగినేని మనీశ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 32వేల చేనేత కుటుంబాలుండేవని, ప్రస్తుతం 32కుటుంబాలు కూడా లేవన్నారు. అంతకుముందు పద్మశాలీ కుల పెద్దలను సన్మానించారు.

మరిన్ని వార్తలు