ఉద్యాన పంటల గిట్టుబాటు ధరలకు కృషి

12 Dec, 2016 14:48 IST|Sakshi
ఉద్యాన పంటల గిట్టుబాటు ధరలకు కృషి
నేషనల్‌ హార్టికల్చర్‌ బోర్డు డైరెక్టర్‌ సత్యకృష్ణం రాజు
తుని రూరల్‌ : జాతీయస్థాయిలో ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధరలు లభించేందుకు నిరంతరం కృషి చేస్తానని నేషనల్‌ హార్టికల్చర్‌ బోర్డు డైరెక్టర్‌ చోడ్రాజు సత్యకృష్ణంరాజు అన్నారు. పదవీ బాధ్యతలు చేపటి సోమవారం తొలిసారిగా తుని వచ్చిన ఆయనకు ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, బీజేపీ నాయకులు పైడా కృష్ణమోహన్, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు రైల్వే స్టేషన్‌లో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వీఐపీ లాంజ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కోకో, కొబ్బరి, ఆయిల్‌పామ్, బొప్పాయి, నిమ్మ, దానిమ్మ, మామిడి, జీడి మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం, గిట్టుబాటు ధరల సాధనకు కృషి చేస్తానన్నారు. పండ్లు, కూరగాయల నిల్వకు కోల్డ్‌ స్టోరీజీలు ఏర్పాటు, రుణ పరపతి పెంపునకు బోర్డులో చర్చకు తీసుకువస్తానని, సాగులో యంత్రీకరణకు అధిక నిధులు కేటాయింపునకు చర్యలు తీసుకుంటానన్నారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించి స్వగ్రామం తేటగుంటకు చేరుకున్నారు. ఈముని అనంతశేషగిరి, ఆకెళ్ల శాస్త్రి, లోవదేవస్థానం ధర్మకర్తలు పుల్లంరాజు, నారాయణాచార్యులు, నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు