జాతీయస్థాయి ప్రదర్శనకు మధుప్రియ ప్రాజెక్టు

12 Dec, 2016 14:31 IST|Sakshi
జాతీయస్థాయి ప్రదర్శనకు మధుప్రియ ప్రాజెక్టు
రైతుకు ఎంతో ఉపకరించే ధాన్యం ఆరబోత యంత్రం
రాష్ట్ర, దక్షిణభారతస్థాయిలలో మన్ననలందుకున్న సృజన
పామర్రు(కె.గంగవరం) : పామర్రు ఉన్నత పాఠశాల విద్యార్థి అనుసూరి మధుప్రియ రూపొందించిన  ధాన్యం ఆరబోసే యంత్రం ప్రాజెక్టు జాతీయస్థాయికి ఎంపికైనట్లు హెచ్‌ఎం ఆర్‌. దయామణి తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు ప్రక్కి వీర బ్రహ్మానందం మార్గదర్శకత్వంలో మధుప్రియ రూపొందించిన ప్రాజెక్టు గత ఏడాది రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రశంసలందుకుందని, అక్కడి నుంచి బెంగళూరులో నిర్వహించిన దక్షిణభారత స్థాయి ప్రదర్శనకు ఎంపికైందని తెలిపారు. ఈ నెల 13 నుంచి 19 వరకూ బెంగళూరులో నిర్వహించే 43వ జవహర్‌లాల్‌ నెహ్రూ నేషనల్‌ సైన్స్, మేథమేటిక్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఎగ్జిబిషన్‌కు ఈ ప్రాజెక్టు జిల్లా నుంచి ఒక్కటే ఎంపికైందన్నారు. ఈ సందర్భంగా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు బ్రహ్మానందం మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షాలకు తడిసిపోవడంతో ఆరుదల శాతం తక్కువగా ఉండిపోవడంతో గిట్టుబాటు ధర లేక ఆవేదన చెందడం చూసి ఈ ప్రాజెక్టును రూపొందించినట్టు తెలిపారు. విద్యుత్‌ మోటార్‌ ఆధారంగా నడిచే ఈ యంత్రం ద్వారా ధాన్యం త్వరగా ఆరిపోతుందని, కూలీల అవసరం లేకుండా ధాన్యాన్ని సులువుగా ఆరబెట్టొచ్చని అన్నారు.
మరిన్ని వార్తలు