భువనగిరిలో జాతీయ స్థాయి క్రీడలు

1 Oct, 2016 22:41 IST|Sakshi
భువనగిరిలో జాతీయ స్థాయి క్రీడలు
భువనగిరి టౌన్‌: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సోమవారం నుంచి జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో అండర్‌– 19 విభాగంలో జరిగే బాల్‌ బ్యాడ్మింటన్, షూటింగ్‌బాల్‌ క్రీడల కోసం మైదానాన్ని ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ క్రీడలకు దేశంలోని 18 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు రానున్నారు. బాల్‌ బాడ్మింటన్‌ బాలురు, బాలికలు, షూటింగ్‌ బాల్‌ బాలురు, బాలికల విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. క్రీడాకారులతో పాటు, కోచ్‌లు, రీఫరీలతో కలిపి మెుత్తం 700 మంది ఈ పోటీలకు హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. క్రీడలకు వచ్చే వారికి కోశం స్థానిక శ్రీచైతన్య, శ్రీ ప్రతిభా, యునిటీ జూనియర్‌ కళాశాలలో బాలురు, ఎస్‌ఎస్‌ఆర్, శ్రీవైష్ణవి, టైమ్స్‌ జూనియర్‌ కళాశాలలో బాలికలకు వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. క్రీడాకారులకు కళాశాల పక్కనే ఉన్న శ్రీవాణి విద్యాలయంలో భోజన వసతి కల్పించనున్నారు. క్రీడల సందర్భంగా రోజువారీ సాంస్క­ృతిక కార్యక్రమాలు సైతం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని శాఖల ఆధ్వర్యంలో ఇప్పటికే సమీక్షా సమావేశాలు సైతం నిర్వహించారు.
 
 
మరిన్ని వార్తలు