ఓసీల సమస్యలపై జాతీయ ఉద్యమం

26 Apr, 2016 20:17 IST|Sakshi

- ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి

మదనపల్లె(చిత్తూరు)

ఓసీల సమస్యల పరిష్కారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కార్యాచరణ ప్రణాళిక ప్రకటించకపోతే జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వాల నిర్లక్ష్యంలో దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల ఉద్యమాలు ఉధృతమవుతున్నాయన్నారు.

విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు, ప్రమోషన్లలో రిజర్వేషన్లు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అంటూ రాజకీయ నాయకులు అగ్రవర్ణాల ద్వితీయ శ్రేణి పౌరులుగా పరగణించడం వల్ల ఓసీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రకులలకు విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్‌చేశారు. ఓసీల అభివృద్ధికి జాతీయస్థాయిలో లక్ష కోట్లు కేటాయించి కార్పొరేషన్ ఏర్పాటుచేస్తే ఆర్థిక అసమానతలు అంతరించి రిజర్వేషన్లు, ఉద్యమాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని కరుణాకర్‌రెడ్డి సూచించారు.

 రాజ్యాంగపరంగా విద్య, ఉద్యోగ, రిజర్వేషన్లు యాభైశాతం అమలుకాగా, జనరల్ కేటగిరీలో కూడా ఇతర వర్గాలవారు ఎంపిక అవుతున్నందున ఓసీలుగా పిలువబడే అగ్రవర్ణాలకు 10 శాతం విద్య, వైద్య ఉద్యోగ అవకాశాలు కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా ఉద్యమాలను విస్తృతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్య యువజన సంఘం రాష్ర్ట అధ్యక్షులు ఓంప్రకాష్, రెడ్డిజన సంక్షేమ సంఘం సమన్వయకర్త రామ్మోహన్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వేమనారాయణ రెడ్డి, అవుల సిద్దారెడ్డి, ఓంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు