అటవీ భూముల్లో ఉపాధి

4 Mar, 2017 23:14 IST|Sakshi
అటవీ భూముల్లో ఉపాధి

► నీటి సంరక్షణ, అడవుల పరిరక్షణకు పెద్దపీట
► పెద్ద ఎత్తున నీటి, ఊట కుంటల తవ్వకాలు
► భూముల సరిహద్దు చుట్టూ కందకాలు
► త్వరలో ముగియనున్న పనుల గుర్తింపు
► ఉపాధి కూలీలకు పని..
► అటవీ ప్రాంతాలకు వైభవం


సాక్షి, రంగారెడ్డి జిల్లా: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు ఇప్పటి  వరకు పల్లెలకే పరిమితమయ్యాయి. ఇకపై ఈ పనుల విస్తృతి పెరగనుంది. అటవీ భూముల్లోనూ ఉపాధి పనులు చేపట్టనున్నారు. అటవీ భూముల్లో వర్షపునీటి వరదకు మట్టి కోతకు గురికాకుండా, భూమిలో తేమ సాంద్రత ఎక్కువ కాలం నిలిపే ప్రక్రియలో భాగంగా ఉపాధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. తద్వారా అటవీ ప్రాంతంలో సారవంతమైన మట్టి కొటుకుపోవడానికి అవకాశం ఉండదు. అలాగే వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా మట్టిలో తేమ ఉంటుంది. తద్వారా మొక్కలు చనిపోకుండా మనుగడ సాగిస్తాయి.

ఫలితంగా హరిత శాతం పెరగడంతో పాటు వన్యప్రాణులకు     వేసవిలో ఎటువంటి ఇబ్బందీ ఉండదు. అడవుల్లో నీటి లభ్యత లేని కారణంగా వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్న విషయం తెలిసిందే. దీంతో మూగజీవులు ప్రమాదాల బారిన పడడంతోపాటు వేటగాళ్లు, ఆకతాయిల చేతిలో బలవుతున్నాయి. తాజాగా నీటిని పెద్దఎత్తున సంరక్షించడం ద్వారా అటువంటి విఘాతాలకు అడ్డుకట్ట వేయవచ్చని సర్కారు భావిస్తోంది. అటవీ భూముల్లో వివిధ పనులను ఉపాధి పథకం ద్వారా చేపట్టడం ద్వారా కూలీలకు పని లభించడంతోపాటు.. అడవులకు వైభవం రానుంది.

చేపట్టే పనులివే...
అటవీ భూముల్లో నీటి సంరక్షణకు పెద్దపీట వేయనున్నారు. ఇందులో భాగంగా వాననీటిని ఒడిసి పట్టేందుకు నీటి కుంటలు, ఇంకుడు గుంతలు తవ్వనున్నారు. అలాగే ఏటావాలుగా ఉన్న ప్రాంతాల్లో భూమికి సమాంతరంగా కండిత కందకాలు తీయనున్నారు. పైనుంచి కిందకు వచ్చే వర్షపు నీరు ఈ కందకాల్లో చేరి భూమిలోకి సులువుగా ఇంకిపోతుంది. అలాగే భూముల రక్షణకూ ఉపక్రమించనున్నారు. అటవీ భూముల సరిహద్దు చుట్టూ వెడల్పాటి కందకాలు ఏర్పాటు చేస్తారు. తద్వారా బయటి నుంచి పశువులు, మనుషులు అటవీ భూముల్లోకి ప్రవేశించడానికి వీలుండదు. ఫలితంగా అటవీ వృక్షాలకు ఎటువంటి ముప్పు వాటిల్లదు. వేసవి వచ్చిందంటే అడవులకు నిప్పంటుకోవడం సహజంగా మారింది.

మానవ తప్పిదం, యాధృచ్ఛికంగా జరుగుతున్న ఈ ప్రమాదాల వల్ల వృక్షాలు కాలి బూడిదవుతుండడంతో హరితం కనుమరుగవుతోంది. ఈ నష్టాన్ని నివారించడానికి చాలా ఏళ్లు పట్టక తప్పదు. ఈ క్రమంలో యంత్రాంగం అగ్ని ప్రమాదాలను సాధ్యమైనంత మేరకు నివారించడంపై దృష్టి సారించింది. అటవీ విస్తీర్ణాన్ని బట్టి ఒకవైపు నుంచి మరోవైపునకు నిర్ణీత వెడల్పులో నేలపై పూర్తిగా మొక్కలు లేకుండా పనులు చేపడతారు. అంటే మట్టి రోడ్డు మాదిరిలా ఆ ప్రాంతాన్ని తయారు చేస్తారు. ఈ విధానాన్ని అవలంభించడం వల్ల మంటల వ్యాప్తి కొంత ప్రాంతానికే పరిమితమై నష్ట తీవ్రత తగ్గుతుంది.

త్వరలో పనుల గుర్తింపు..
అటవీ భూముల్లో నీటి సంరక్షణ, మొక్కల పెంపకం వంటి పనులు చేపట్టడానికి ఆ శాఖకు పెద్దగా నిధుల కేటాయింపు లేదు. అలాగే మానవ వనరులూ తక్కువే. దీంతో భూముల పరిరక్షణ కష్టంగా మారింది. ఇప్పటికే గ్రామాల్లో ఉపాధి కింద ఆ పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ శాఖకు చెందిన భూముల్లోనూ గుర్తించిన పనులను చేపట్టాలని గ్రామీణాభివృద్ధి శాఖను కోరినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే అటవీ భూముల్లో ఉపాధి కింద పనులు చేసేందుకు మార్గం సుగమం అయిందని అధికారులు వివరిస్తున్నారు. అటవీ భూముల్లో ఏయే ప్రాంతాల్లో ఏయే రకం పనులు చేపట్టాలన్న అంశంపై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు అటవీ శాఖకు తాజాగా లేఖ రాశారు. వీలైనంత త్వరలో పనులు గుర్తించాలని కోరారు. ఈ పనులను పూర్తిగా ఉపాధి హామీ కూలీలే చేయనున్నారు. పనుల అంచనాలు రూపొందించడంతోపాటు కూలీలకు వేతనాలు అందజేయడం గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యత. పనుల పర్యవేక్షణ మాత్రం అటవీ శాఖ అధికారులదే.

పచ్చదనం 9.75 శాతమే..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విస్తీర్ణం 7,493 చదరపు కిలోమీటర్లు. నేషనల్‌ ఫారెస్ట్‌ పాలసీ ప్రకారం ఇందులో 33శాతం హరితం పరుచుకోవాలి. కానీ జిల్లాలో అతి భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో పచ్చదనం కేవలం 9.75 శాతానికే పరిమితమైనట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇలా సమతుల్యత లోపించడం కారణంగానే పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయని, వర్షాలు సమృద్ధిగా కురవడం లేదని నిపుణులు వివరిస్తున్నారు. భవిష్యత్‌ ఇవే పరిస్థితులు కొనసాగితే మానవ మనుగడకు ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఉపద్రవం ముంచుకరాకముందే యంత్రాంగం మేల్కొంటోంది. ఉపాధి పథకంలో భాగంగా అటవీ భూముల్లో విస్తృతంగా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు