వరంగల్‌ నిట్‌కు జాతీయ స్థాయి గుర్తింపు

4 Sep, 2016 00:39 IST|Sakshi
వరంగల్‌ నిట్‌కు జాతీయ స్థాయి గుర్తింపు
  • పరిశోధనాత్మక విద్యతో ముందుకు వెళ్లాలి
  • స్నాతకోత్సవంలో డాక్టర్‌ సంజయ్‌ గోవింద్‌ దండే
  • ఎనిమిది మందికి బంగారు పతకాలు, 4,151 మందికి డిగ్రీలు ప్రదానం
  • కాజీపేట రూరల్‌ : వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌)కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని కాన్పూర్‌ ఐఐటీ పూర్వ డైరెక్టర్‌ పద్మశ్రీ డాక్టర్‌ సంజయ్‌ గోవింద్‌ దండే అన్నారు. నిట్‌ ఆడిటోరియంలో శనివారం 14వ స్నాతకోత్సవం కనుల పండువగా జరిగింది. స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా సంజయ్‌ మాట్లాడుతూ నిట్‌ విద్యార్థులు ఇక్కడ అధ్యాపకుల సేవలను వినియోగించుకుంటూ పరిశోధనలపై దృష్టి సారించాలని సూచించారు. నైపుణ్యం కలిగిన విద్య పూర్తిచేసిన వారి ద్వారానే సమాజ మార్పు సాధ్యమవుతుందని తెలిపారు. నిట్‌ ఇన్‌చార్జి డైరెక్టర్‌ జీఆర్‌సీ.రెడ్డి మాట్లాడుతూ నిట్‌లో చదువుకునే విద్యార్థులు పరిశోధనల ద్వారా తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకున్నారని తెలిపారు. అనంతరం సివిల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థి, నేపాల్‌ వాసి నిశ్చల్‌ ప్రసాద్‌ నుచ్చే ప్రదాన్‌కు ఇన్‌స్టిట్యూట్‌ గోల్డ్‌ మెడల్‌తో పాటు రోల్‌ ఆఫ్‌ హానర్‌ గోల్డ్‌ మెడల్‌ అందజేశారు. ఇంకా చామ వెంకట మంజునాథరెడ్డి, కొండపర్తి సాయి విష్ణువర్థన్, కొల్లి శ్రీకాంతప్రసాద్, ఆలే శ్రావణి, మన్వితరెడ్డి, రోబిన్‌ ఓం నెహ్రాకు బంగారు పతకాలు, 4151 మంది విద్యార్థులకు డిగ్రీలు, మరికొందరికి పీహెచ్‌డీలు ప్రదానం చేశారు. ఈ స్నాతకోత్సవంలో నిట్‌ రిజిస్ట్రార్‌ వైఎన్‌.రెడ్డి, అన్ని విభాగాల డీన్లు, ప్రొఫెసర్లు, సెనేటర్లు పాల్గొన్నారు. కాగా, స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో నిట్‌లో సందడి నెలకొంది. పట్టాలు స్వీకరించిన అనంతరం విద్యార్థులు ఫొటోలు దిగుతూ ఆనందంగా గడిపారు.
     
    నేపాల్‌ ప్రజలకు సేవ చేయాలని ఉంది
    నిట్‌లో సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన నాకు ఇన్‌స్టిట్యూట్‌ గోల్డ్‌మెడల్‌ సాధించడం ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు నిట్‌లో వివిధ కేటగిరీల్లో ఏడు బంగారు పతకాలు సాధించాను. భవిష్యత్‌లో ఉన్నత స్థానానికి చేరాక మా దేశ ప్రజలకు సేవ చేయాలనేది నా ఆకాంక్ష.  – నిశ్చల్‌ ప్రసాద్‌ నుచ్చే ప్రదాన్, నేపాల్‌ 
     
    ఐఏఎస్‌ నా లక్ష్యం
    నిట్‌ ఎలక్ట్రికల్‌ విభాగంలో ఇంజనీరింగ్‌ పూర్తి చేశాను. ప్రస్తుతం గోల్డ్‌ మెడల్‌ సాధించడంతో నాకు ఆనందం రెట్టింపైంది. నేను చదువుపై దృష్టి సారించేలా తల్లిదండ్రులు, అధ్యాపకులు సహకరించారు. భవిష్యత్‌లో ప్రజలకు సేవ చేసేందుకు ఏఐఎస్‌ సాధించాలనేది లక్ష్యం.             – వెంకట మంజునాథరెడ్డి, కడప 
     
    జనరల్‌ మోటార్స్‌లో ఉద్యోగం చేస్తున్నా..
    నిట్‌లో మెకానికల్‌ ఇంజనీర్‌ అయిపోయింది. గోల్డ్‌ మెడల్‌ రావడం సంతోషంగా ఉంది.  నిట్‌లో జరిగిన ప్లేస్‌మెంట్‌ ద్వారా పూణేలోని జనరల్‌ మోటార్స్‌లో ఉద్యోగం సాధించాను. అయితే, ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు ప్రిపేర్‌ అయి ఐఏఎస్‌ సాధించి ప్రజలకు సేవ చేస్తా.
    – సాయి విష్ణువర్ధన్, స్టేషన్‌ ఘన్‌పూర్, వరంగల్‌
     
    హార్డ్‌వేర్‌ కంపెనీ పెడతా..
    నిట్‌లో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ పూర్తి అయిపోయిది. కాలిఫోర్నియాలోని యూసీఎల్‌ఏలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో భాగంగా ఉద్యోగం సాధించి చేస్తున్నాను. కొంతకాలం తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి హార్డ్‌వేర్‌ చిప్స్‌ కంపెనీ పెట్టి మరికొందరికి ఉపాధి కల్పిస్తా.
    – శ్రీకాంత ప్రసాద్, వరంగల్‌ 
     
    ఉన్నత చదువులపైనే దృష్టి
    నిట్‌లో మెటలార్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాను. పలు సంస్థల్లో ఉద్యోగాలు వస్తున్నా వాటిపై నాకు ఆసక్తి లేదు. భవిష్యత్‌లో ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాను. ప్రస్తుతం  ఇక్కడ బంగారు పతకం సాధించడం ఆనందంగా ఉంది.
    – ఆలే శ్రావణి, హైదరాబాద్‌  
మరిన్ని వార్తలు