హైట్ పెంచితే హిట్!

16 Nov, 2015 00:20 IST|Sakshi
హైట్ పెంచితే హిట్!

‘మర’ల ఎత్తు 100 మీటర్లకు పెంచితే మరింత పవన విద్యుత్
♦ రాష్ట్రంలో 4,244 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తికి అవకాశాలు  
♦ మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉత్పత్తికి వీలు
♦ జాతీయ పవన విద్యుత్ సంస్థ నివేదిక
♦ పవన విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు త్వరలో కొత్త విధానం
 
 సాక్షి, హైదరాబాద్:  గాలి మరల ఎత్తును 100 మీటర్లకు పెంచితే తెలంగాణలో 4,244 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తికి ఆస్కారముందని జాతీయ పవన విద్యుత్ సంస్థ (ఎన్‌ఐ డబ్ల్యూఈ) అధ్యయనంలో తేలింది. కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్‌ఆర్‌ఈ) ఆదేశాలతో దేశంలో పవన విద్యుదుత్పత్తికి ఉన్న అవకాశాలపై శాస్త్రీయ అధ్యయనం జరిపిన ఈ సంస్థ, ఇటీవల తన నివేదికను ప్రచురించింది. 100 మీటర్ల ఎత్తులో గాలి మరల ఏర్పాటు ద్వారా దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాల పరిధిలో ఏకంగా 3,02,251 మెగావాట్ల పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని ఈ నివేదిక పేర్కొంది. 2022 నాటికి దేశంలో పవన విద్యుదుత్పత్తి 66,000 మెగావాట్ల లక్ష్యాన్ని అందుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. 

నిర్ణీత వేగంతో గాలులు వీచే ప్రాంతాల్లో మాత్రమే పవన విద్యుత్ ఉత్పత్తికి అవకాశముంది. తీర ప్రాంతాలైతే పవన విద్యుదుత్పత్తికి అత్యంత అనుకూలం. తీర ప్రాంతాలు లేని.. వేగంగా గాలులు వీచని ప్రాంతాల్లో సంప్రదాయ పద్ధతిలో 50 మీటర్ల ఎత్తులో గాలి మరలను ఏర్పాటు చేస్తే లక్ష్యం మేరకు పవన విద్యుదుత్పత్తికి అవకాశం లేదు. ఈ నేపథ్యంలో గాలి మరల ఎత్తును 100 మీటర్లకు పెంచితే లక్ష్యానికి ఎన్నో రేట్లు ఎక్కువగా పవన విద్యుదుత్పత్తికి అవకాశముందని జాతీయ పవన విద్యుత్ సంస్థ తన నివేదికలో స్పష్టం చేసింది. కేంద్ర ఇంధన శాఖ నుంచి ఈ నివేదిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. దీని ఆధారంగానే రాష్ట్రంలో పవన విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందిస్తోంది.

 సాగు భూముల్లో విద్యుత్ పంట
 రాష్ట్రంలో మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలు మాత్రమే పవన విద్యుదుత్పత్తికి అనుకూలంగా ఉన్నాయి. రాష్ట్రంలో 4,244 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తికి అవకాశం ఉండగా, సాగుభూముల్లో 3,348 మెగావాట్లు, బీడు భూముల్లో 887 మెగావాట్లు, అటవీ భూముల్లో తొమ్మిది మెగావాట్ల ఉత్పత్తికి అవకాశముంది. తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే 371 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవచ్చని ఈ నివేదిక సూచించింది. చదరపు కిలోమీటర్ పరిధిలో  ఆరు మెగావాట్ల వరకు విద్యుదుత్పత్తికి వీలుంటుందని తెలుస్తోంది.
 
 ఏపీలో 44,229 మెగావాట్ల పవన విద్యుత్‌కు అవకాశాలు
 పవన విద్యుదుత్పత్తికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత అనుకూలంగా ఉందని ఆ నివేదిక ద్వారా తెలుస్తోంది. 100 మీటర్ల ఎత్తులో గాలిమరల ఏర్పాటు ద్వారా ఏపీలో ఏకంగా 44,229 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తికి అవకాశముంది. సముద్ర తీర ప్రాంతం విస్తారంగా ఉండటం, రాష్ట్రం మీదుగా అత్యంత వేగంగా గాలులు వీస్తుండటం వల్ల ఏపీలో పవన విద్యుదుత్పత్తికి అనుకూల వాతావరణం ఉంది. ఇక్కడి బీడు భూముల్లోనే 22,525 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తికి అవకాశం ఉండగా, సాగుభూముల్లో 20,538 మెగావాట్లు, అటవీ భూముల్లో 1,165 మెగావాట్ల వరకు విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు.

మరిన్ని వార్తలు