జాతీయ భావం.. సమైక్య సంకల్పం

8 Aug, 2016 20:08 IST|Sakshi
జాతీయ భావం.. సమైక్య సంకల్పం
పెదవేగి రూరల్‌: వెయ్యి గళాలు ఒక్కటయ్యాయి.. ఐదు గంటల పాటు మదినిండా దేశభక్తి భావంతో చిన్నారులు జాతీయ గీతం, జాతీయ గేయం, దేశ ప్రతిజ్ఞను మూడు భాషల్లో ఆలపించారు. జాతీయ భావాన్ని, సమైక్య సంకల్పాన్ని ఎలుగెత్తి చాటారు. 75వ క్విట్‌ ఇండియా దినోత్సవం, 70వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని పెదవేగి ఎస్‌ఎంసీ పాఠశాలలో సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఏలూరు విజన్‌ లయన్స్‌ క్లబ్, ఎస్‌ఎంసీ పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. తెలుగు బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌లో స్థానం కోసం ‘వందేమాతరం, జనగణమని,  భారతదేశం నా మాతృభూమి’ని ఆలపించి చిన్నారులు ఆకట్టుకున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి జాతీయ సమైక్యతను పెంపొందించేలా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని తెలుగు బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ పరిశీలకుడు సాయిశ్రీ అన్నారు. ఎస్‌ఎంసీ సంస్థ చైర్మన్‌ ఫాదర్‌ డొమినిక్‌ చుక్కా జ్వోతి ప్రజ్వలనం చేశారు. సభాధ్యక్షుడిగా లయన్‌ ఎ.శేషుకుమార్‌ వ్యవహరించగా విశిష్ట అతిథిగా డీజీఎం ఫాదర్‌ మోజెస్‌ హాజరయ్యారు. ముందుగా స్వాతంత్య్ర పోరాటంలో దేశం కోసం ప్రాణాలర్పించిన నాయకుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. లయన్‌ అక్కినేని వెంకటేశ్వరరావు, జోన్‌ చైర్‌పర్సన్‌ సీహెచ్‌ అవినాష్‌రాజ్, సర్పంచ్‌ మాతంగి కోటేశ్వరరావు, హెచ్‌ఎం కె.ఉషారాణి, లయన్‌ నూలు రామకృష్ణ పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు