వైభవంగా సుశమీంద్రుల ఆరాధన

14 Apr, 2017 00:04 IST|Sakshi
వైభవంగా సుశమీంద్రుల ఆరాధన
మంత్రాలయం : నడిచే రాఘవేంద్రులుగా ఖ్యాతి పొందిన శ్రీ మఠం పూర్వపు పీఠాధిపతి సుశమీంద్ర తీర్థుల ఆరాధన మహోత్సవం నయానందకరంగా సాగింది. గురువారం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థుల నేతృత్వంలో ఆరాధన వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనంకు విశేష దినసరి పూజలు శాస్రోత్తంగా కానిచ్చారు. అనంతరం సుశమీంద్ర తీర్థుల మూలబృందావనంకు నిర్మల్య విసర్జన, ఫల, పుష్ప, పంచామృతాభిషేకాలు గావించి çపుష్ప, బంగారు కవచ ధారణతో విశేషపూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన పట్టువస్త్రాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం సుశమీంద్రుల చిత్రపటాని డోలోత్సవ మండపంలో ఉంజలసేవ గావించి ప్రవచనాలు చేశారు. స్వర్ణ రథం పై సుశమీంద్రుల చిత్రపటాని కొలువుంచగా పీఠాధిపతి మంగళహరతులతో రథయాత్రకు అంకురార్పణ పలికారు. మంగళ వాయిద్యాలు, అశేష భక్త జన హర్షధ్వనుల మధ్య శ్రీ మఠం మాఢ వీధుల్లో రథయాత్ర రమణీయంగా సాగింది. వేడుకల్లో శ్రీ మఠం మేనేజర్‌ శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపీ నరసింహమూర్తి, అసిస్టెంట్‌ పీఆర్వో వ్యాసరాజాచార్‌ తదితరులు పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు