నయీం కేసులో ఎవరినీ వదలం

6 Sep, 2016 19:22 IST|Sakshi
నయీం కేసులో ఎవరినీ వదలం
  • ఎస్సైలకు కౌన్సెలింగ్‌
  • రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి
  • గోదావరిఖని : గ్యాంగ్‌స్టర్‌ నయీం అక్రమ దందాకు సంబంధించి సిట్‌ విచారణ కొనసాగుతోందని, ఆయనకు అనుకూలంగా ఎవరూ వ్యవహరించినా వదిలిపెట్టేది లేదని రాష్ట్ర హోంశాఖ, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టంచేశారు. కరీంనగర్‌ జిల్లా రామగుండం ఎన్టీపీసీలో ఉద్యోగుల గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. నయీం బాధితులకు భూములిప్పిస్తామని, ఈ విషయంలో ప్రభుత్వం నిష్పక్షపాతంగా పనిచేస్తుందని చెప్పారు. చట్టానికి విరుద్ధంగా ఎవరూ పనిచేసినా వారిని క్షమించబోమని అన్నారు. రాష్ట్రంలో ఇటీవల ఎస్సైలు ఆత్మహత్య చేసుకుంటున్న నేపథ్యంలో ఎస్సైలకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నామని, వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నామని వివరించారు. ఇప్పటికే జిల్లాల స్థాయిలో ఎస్సైలకు ఎస్పీలు కౌన్సెలింగ్‌ నిర్వహించారని, ఒత్తిడికి లోనుకావద్దని చెప్పారన్నారు. ప్రజల్లో ఉండి పనిచేయాల్సిన వారు మనోధైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలోని 550 పోలీస్‌స్టేషన్లకు వాహనాలను సమకూర్చామని, ఎస్సైలకూ వాహనాలు అందజేశామన్నారు. నగరాలలో పెట్రోలింగ్‌ నిర్వహించే వారికి వైర్‌లెస్‌ సెట్లు ఇచ్చామని చెప్పారు. త్వరలోనే హైదరాబాద్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నిర్మాణం జరుగుతుందని, అది పూర్తయితే రాష్ట్రంలో ఎక్కడ  ఏ సంఘటన జరిగినా వెంటనే రాజధానికి సమాచారం చేరుతుందని వివరించారు. జిల్లా కేంద్రాలలో ఉండే పోలీస్‌స్టేషన్లకు రూ.75 వేలు, పట్టణాల పరిధిలో రూ.50 వేలు, గ్రామీణ ప్రాంతాలలో ఉండే పోలీస్‌స్టేషన్లకు రూ.25 వేలు నిర్వహణ ఖర్చుల కింద కేటాయించామని తెలిపారు.
    ప్రజాభిప్రాయం మేరకే జిల్లాల పునర్విభజన
    జిల్లాల పునర్విభజన ప్రజాభిప్రాయం మేరకు జరుగుతోందని, అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టంచేశారు. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ప్రజలకు అనుకూలంగా నిర్ణయించాలని ముఖ్యమంత్రి జిల్లాస్థాయి అధికారులను ఆదేశించారన్నారు. ప్రజాప్రతినిధులతో జిల్లాల వారీగా మాట్లాడి, అన్ని అఖిలపక్షం సమావేశంలో చర్చించిన విషయాలు, అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అఖిలపక్ష సమావేశంలో జనగామ, గద్వాలను జిల్లాలుగా చేయాలని కాంగ్రెస్‌ పార్టీ కోరలేదని, ఇప్పుడు మాత్రం వాటిని జిల్లాలుగా చేయాలంటూ నిరాహారదీక్షలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.  మల్లన్నసాగర్‌పై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తూ అడ్డుతగులుతున్నాయన్నారు. సమావేశంలో ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ, మేయర్‌ కొంకటి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
     
     
మరిన్ని వార్తలు