నాకు డబ్బే ముఖ్యం

16 Aug, 2016 00:41 IST|Sakshi
నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన చిన్ననాటి స్నేహితులతో నయీమ్ (సర్కిల్లో)

* స్నేహం గీహం జాన్తానై
* నీ ఇంట్లో మగదిక్కు లేకుండా చంపాలనుకున్నా
* చిన్ననాటి స్నేహితుడు సోమ రామకృష్ణకు నయీమ్ బెదిరింపులు
* నాటి భయంకర రోజులను గుర్తుచేసుకున్న రామకృష్ణ

భువనగిరి: ‘‘నేను నక్సలైట్లతో పోరాడుతున్నా.. నాకు డబ్బే ముఖ్యం.. దానికి మించి మరేది నాకవసరం లేదు.. నేను కబ్జా చేసిన భూమిని ప్రభుత్వంతో ఒత్తిడి తెచ్చి తీసుకున్నారు.. నాకు నష్టం జరిగింది.. ఇప్పటి వరకు ఎవరూ ఇలా తీసుకోలేదు. అంతటితో ఆగకుండా మీ తమ్ముడు నాపై ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఆ సంగతి నాకు వెంటనే  తెలిసింది.

దీంతో మీ ఇంట్లో మగ దిక్కులేకుండా చేద్దామనుకున్నా.. నీవు త్రుటిలో తప్పించుకున్నావు. మీ తమ్ముడ్ని చంపేశాం..’’ అని నయీమ్ తనను బెదిరించినట్టు భువనగిరికి చెందిన సోమ రామకృష్ణ అలియాస్ నవత రాము చెప్పారు. చిన్నతనంలో నయీమ్, ఈయన స్నేహితులు. కొన్నాళ్ల తర్వాత ఓ భూమి విషయంలో ఈయనను సైతం నయీమ్ బెదిరించాడు. రామకృష్ణ సోమవారం తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
 
నా తమ్ముడి తల కోసి చంపాడు..
నయీమ్, నేను స్థానిక డిగ్రీ కళాశాలలో చదువుకున్నాం. అప్పట్నుంచే స్నేహితులం. మా ఇంటికి వచ్చేవాడు. చదువుకునే సమయంలో చురుగ్గా ఉండేవాడు. పాములతో భయపెట్టేవాడు. ఆయన సోదరిని నల్లగొండలో దగ్గరి బంధువు ప్రేమ పేరుతో మోసం చేశాడు. అప్పుడు పోలీస్‌లకు ఫిర్యాదు చేస్తే న్యాయం జరగలేదు. దీంతో ఆగ్రహించి ఆలేరు దళంలో చేరాడు. ఆ తర్వాత నాకు కలువలేదు. 2009లో భువనగిరి మండలం ముత్తిరెడ్డి గూడెం వద్ద మా దగ్గరి బంధువు రాజ్‌కుమార్‌కు చెందిన 50 ఎకరాల స్థలంలో 11 ఎకరాల స్థలం కబ్జా పెట్టాడు.

దీంతో అతడు అప్పటి ప్రభుత్వాన్ని ఆశ్రయించాడు. దగ్గరి బంధువు కావడంతో నేను కూడా ఆయనతో వెళ్లాను.  దీంతో స్పందించిన ప్రభుత్వం కబ్జాలో ఉన్న స్థలాన్ని తిరిగి ఇప్పించింది. ఈ విషయంలో నేను.. రాజ్‌కుమార్‌కు సహకరించానని ఆగ్రహంతో 2010 నవంబర్ 29న నాపై భువనగిరి శివారులోని మాస్‌కుంట వద్ద నయీమ్ అనుచరులు హత్యాయత్నం చేశారు. కొద్దిలో తప్పించుకున్నా. ఈ విషయాన్ని అప్పటి ఎస్పీకి తమ్ముడు రాధాకృష్ణ, నేను కలిసి ఫిర్యాదు చేశాం. అయితే అక్కడ ఉన్న పోలీస్ ఒకరు నయీమ్‌కు సమాచారం అందించాడు.

దీంతో కక్ష పెంచుకున్న నయీమ్ అరు నెలల తర్వాత హైదరాబాద్‌లో ఉంటున్న నా తమ్ముడు రాధాకృష్ణను ఇంటి వ ద్దే నయీమ్ అనుచరులు తల కోసి దారుణంగా చంపారు. దీంతో భయంతో వణికిపోయిన మా కుటుంబం ప్రాణాలు దక్కించుకోవడానికి ఎలాగైనా నయీమ్‌ను కలిసి రాజీ చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. కొందరు స్నేహితులు నయీమ్‌తో గొడవ ఎందుకని హితవు చెప్పారు. అప్పటికే పలుమార్లు నయీమ్ నుంచి పిలుపు వచ్చింది.
 
స్నేహాన్ని గుర్తు చేసినా వినలేదు..
2011లో నేను, నయీమ్‌ను రహస్య ప్రాంతంలో కలిశా. మా తమ్మున్ని ఎందుకు చంపావని అడిగితే ముత్తిరెడ్డిగూడెంలో కబ్జా చేసిన భూమి విషయం, పోలీస్‌లకు చేసిన ఫిర్యాదు విషయాలను చెప్పాడు. ‘మీ కుటుంబంలో మగదిక్కు లేకుండా చేయాలనుకున్నా. కానీ నీవు తప్పించుకున్నావు. నాకు కలిగిన నష్టం భర్తీ చేసుకునే వరకు వదిలేది లేదు’ అని హెచ్చరించారు. చదువుకునే రోజుల్లో చేసిన స్నేహం, అప్పటి మధుర క్షణాలు, కలిసిమెలిసి తిరిగిన పలు విషయాలు గుర్తు చేస్తే.. ‘అవన్నీ నాకు అవసరం లేదు.

నేను కబ్జా చేసిన 11 ఎకరాల భూమి విషయంలో జరిగిన నష్టం పూడ్చాలి. లేదంటే ఇప్పటికే నీ తమ్ముడు చనిపోయాడు. నీతోపాటు నీ కుటుంబ సభ్యులు , నీ రక్త సంబంధీకులు ఎవరు మిగలరు. నీ ఇష్టం..’ అని  బెదిరించాడు. దీంతో విధిలేక ఉన్న అస్తులు, బంగారం తెగనమ్మి, అప్పులు తెచ్చి పెద్ద మొత్తంలో చెల్లించి బయటపడ్డాను. అలాగే నాకు దగ్గరి బంధువు ఎన్నారై ఇండియాలో స్థిరపడదామని భునగిరికి వస్తే నయీమ్ బెదిరించి రూ.50 లక్షలు వసూలు చేశాడు. దీంతో అతను అమెరికా తిరిగి వెళ్లిపోయాడు. ఇప్పటికైనా నయీమ్‌ను ఎన్‌కౌంటర్ చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేరు. కానీ కోల్పోయిన అస్తులు, డబ్బులు బాధితులకు తిరిగి ఇప్పిస్తే  జీవితాంతం సీఎంకు  రుణపడి ఉంటాం.

మరిన్ని వార్తలు