నయీమ్‌ నీడ

13 Aug, 2016 11:11 IST|Sakshi
నయీమ్‌ కొనుగోలు చేసినట్లు భావిస్తున్న ఇల్లు
 • తల్లిదండ్రుల పేర విరాళం
 • అంజన్న ఆలయానికి రూ.1.10లక్షలు
 • గాంధీనగర్‌ కాలనీలో కలకలం
 • పలుమార్లు వచ్చినట్లు అనుమానాలు
 • ఆరా తీస్తున్న నిఘా విభాగాలు
 • చాంతాడంత నేర చరిత్ర.. రాష్ట్రాలు.. జిల్లాలను కుదిపేసిన నయీమ్‌ అక్రమాల జాడలు జిల్లాలో వెలుగుచూస్తున్నాయి. సేఫ్‌ జోన్‌గా ఉన్న జిల్లాలో నయీమ్‌ కదలికలు ఉన్నాయా.. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్లాడా.. ఆయనకు ఇక్కడ సన్నిహితంగా ఉన్నది ఎవరు.. గుడి నిర్మాణానికి తల్లిదండ్రుల పేరు రూ.1.10లక్షల విరాళం ఎందుకిచ్చాడు.. బీబమ్మ అలియాస్‌ సుల్తానాబేగం ఇల్లు కొని.. ఆమె అక్కడ లేకుండా పోవడం.. ఆ ఇంట్లో అద్దెకున్న వారు కిరాయి డబ్బులకు ఎవరూ రాలేదని చెప్పడం.. పలు అనుమానాలకు తావిస్తోంది. గాంధీనగర్‌ కాలనీలోని ఇంటిని డెన్‌గా వాడుకున్నాడా.. ఖమ్మం నుంచి విజయవాడ వెళ్లే రాష్ట్రీయ రహదారికి పక్కనే ఇల్లు ఉండటం సేఫ్‌గా ఉంటుందని నయీమ్‌ భావించాడా.. అనే విషయాలపై పోలీసులు తీగ లాగుతున్నారు. నయీమ్‌ నీడ జిల్లాలో ఎప్పటి నుంచి ఉందనే దానిపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.
  – సాక్షిప్రతినిధి, ఖమ్మం/ఖమ్మం

  స్వాతంత్య్ర సమరయోధులు 40 మందికి చింతకాని మండలం గాంధీనగర్‌ కాలనీలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అయితే నేలకొండపల్లి మండలం చెరువుమాదారం గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు సూర్యపల్లి శ్రీపతి పేర ఆయన భార్య తిరుపతమ్మకు ఇక్కడ ప్రభుత్వం 2001, ఆగస్టు 24న ఇంటి స్థలం ఇచ్చింది. శ్రీపతి కొడుకు ప్రకాశం ప్రస్తుతం చెరువు మాదారం వీఆర్‌ఏగా విధులు నిర్వహిస్తున్నారు. అక్కడ స్థలం రావడంతో నాలుగు గదుల ఇంటిని కట్టించాడు. అక్కడ ఉండేందుకు ఇష్టం లేక చెరువు మాదారంలోనే ఓ ఇంటిని అమ్మకానికి పెట్టడంతో.. గాంధీనగర్‌ కాలనీలోని ఇంటిని 2007–08లో రూ.3.25లక్షలకు విక్రయించాడు.
  మహిళలే కొన్నారు..
  తమ గ్రామంలో ఇంటిని కొనుగోలు చేసుకుంటున్నామని.. గాంధీనగర్‌ కాలనీలో కట్టిన ఇంటిని విక్రయిద్దామని ఇంటి పక్కనే ఉన్న అరుణమ్మకు చెప్పారు. అయితే ఖమ్మం మీదుగా కారులో విజయవాడ వెళ్తూ.. ఓ మహిళ గాంధీనగర్‌ కాలనీ సమీపంలో ఆగింది. అక్కడే పశువులు కాస్తున్న అరుణమ్మను ఇక్కడ ఎవరైనా ఇల్లును అమ్ముతారా..? కొనుగోలు చేస్తామని చెప్పడంతో.. ఫలానా వారి ఇల్లు ఉందని చెప్పింది. దీంతో సమయం చూసుకుని ఓ నలుగురు మహిళలు, ఓ వ్యక్తి ఇన్నోవా కారులో గాంధీనగర్‌ కాలనీకి 2007లో వచ్చారు. ప్రకాశంను, అతడి తల్లిని అరుణమ్మ తన ఇంటికి పిలిపించుకుంది. ఇక్కడే ఇంటి కొనుగోలు.. డబ్బు ముట్టచెప్పడం.. అగ్రిమెంట్లు రాసుకోవడం జరిగింది. ఓ నలుగురు మహిళలే ఇన్నోవా కారులో నుంచి కిందికి దిగి కొనుగోలు వ్యవహారం చూశారు. కానీ.. ఓ వ్యక్తి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇన్నోవా కారులోనే ఏసీలో ఉన్నాడు. కారులో ఉన్న వ్యక్తి నయీమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
  బీబమ్మ అలియాస్‌ సుల్తానాబేగం ఎవరు?
  ఇల్లు కొనుగోలు వ్యవహారం తర్వాత ఇక్కడ బీబమ్మ అలియాస్‌ సుల్తానాబేగం ఈ ఇంట్లో 2008 నుంచి 2011 వరకు ఉంది. ఐదేళ్ల నుంచి ఆమె ఇక్కడ లేదు. కాలనీలో పక్క ఇంటి వారు కూడా బీబమ్మ కనిపించడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఆ ఇంట్లో ఖమ్మం కోర్టులో బెంచ్‌ క్లర్క్‌గా పనిచేస్తున్న రహీం అద్దెకు ఉంటున్నాడు. ఏడాది వరకు అద్దె చెల్లించామని, ఆ తర్వాత అద్దె కోసం ఎవరూ రాలేదని, ఆమె ఎటు వెళ్లిందో కూడా తెలియదని ఇతను చెబుతుండటం గమనార్హం. బీబమ్మ నయీమ్‌ అత్త సుల్తానాబేగమా..? అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. నయీమ్‌ అత్త సుల్తానా మిర్యాలగూడెంలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఆమెను కూడా రిమాండ్‌ చేసిన విషయం విదితమే. ఇల్లు కొనుగోలు, ఆ తర్వాత కొంతకాలం ఇక్కడే ఉండి.. నయీమ్‌ అత్తగా భావిస్తున్న సుల్తానానే ఇక్కడ ఏమైనా వ్యవహారాలు చక్కబెట్టిందా? అనే చర్చ జరుగుతోంది.
  మహిళలు, కుక్కలతో ఓ వ్యక్తి వచ్చేవాడు..
  ఇంట్లో బీబమ్మ ఉన్నప్పుడు 2011కు ముందు రెండు, మూడుసార్లు నలుగురైదుగురు మహిళలు, ఓ వ్యక్తి వచ్చి పోయినట్లు కాలనీవాసులు చెబుతున్నారు. నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ఆ వ్యక్తి నయీమ్‌ అయి ఉంటాడని కూడా ఆరోపణలు వస్తున్నాయి. కుక్కలను పెంచడం నయీమ్‌కు ఇష్టం కావడం.. ఇక్కడకు వచ్చిన వ్యక్తి కూడా కుక్కతో మెయిన్‌ రోడ్డుపై తిరిగేవాడని, ఆ తర్వాత బయటకు కనిపించే వాడు కాదని అక్కడి వారు చెబుతున్నారు. మేము చూసిన వ్యక్తి నయీమ్‌ను పోలినట్లే ఉన్నాడని కాలనీవాసులు చెబుతుండటం అనుమానాలకు తావిస్తోంది.
  రికార్డుల్లో నయీమ్‌ తల్లిదండ్రుల పేర్లు
  నయీమ్‌ తల్లిదండ్రుల పూర్తి పేరు ఎండీ.ఖాజా నసీరుద్దీన్, తాహెరాబేగం. ఈ రెండు పేర్లు చింతకాని మండలం బొప్పారం గ్రామ పంచాయతీ రికార్డుల్లో గాంధీనగర్‌ కాలనీకి చెందిన వాస్తవ్యులుగా నమోదై ఉన్నాయి. ఇంటి నం.48గా వీరి పేర్లు నమోదై ఉన్నాయి. అయితే వీరు నయీమ్‌ తల్లిదండ్రులు కాకున్నా.. ఆ గ్రామంలో మాత్రం ఈ పేర్లతో ఎవరూ లేరు. వీరి బంధువులు కూడా ఎవరూ లేరు.
  ఇంటికి రూ.3.25లక్షలు.. విరాళం రూ.1.10లక్షలు
  మహిళలు ఒకేసారి రూ.3.25లక్షలు చెల్లించి ఇంటిని కొనుగోలు చేస్తే.. ఆ తర్వాత రెండేళ్లకు కాలనీలో హనుమాన్‌ టెంపుల్‌ నిర్మాణానికి రూ.1.10లక్షలు విరాళం ఇచ్చారు. అయితే ఈ విరాళాన్ని తాహెరాబేగం, నజీరుద్దీన్‌ పేరుతో అందజేశారు. ఆలయంలో దాతల పేర్లతో ఉన్న శిలాఫలకంపై ఈ పేర్లు ఉన్నాయి. ఆలయానికి విరాళం ఇచ్చిన దాతల్లో అత్యధికంగా నాలుగు కుటుంబాలకు చెందిన వ్యక్తులు రూ.1.58లక్షలు ఇస్తే.. రెండో దాతగా తాహెరాబేగం, నజీరుద్దీన్‌ పేర్లే ఉన్నాయి. భువనగిరి, యాదగిరిగుట్ట, హైదరాబాద్‌ ప్రాంతాల్లో గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు, మహంకాళి ఉత్సవాలకు భారీగా విరాళాలు ఇచ్చి యువతను ఆకర్షించడంలో నయీమ్‌ దిట్ట. ఈ కోణంలోనే ఇక్కడ కూడా విరాళం ఇచ్చినట్లు అనుమానాలు వస్తున్నాయి.
  దొంగతనంతో వెలుగులోకి సీసీ కెమెరాలు
  2011లో బీబమ్మ ఇంట్లో ఉన్న సమయంలోనే దొంగలు పడ్డారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. బీబమ్మను విచారించేందుకు ప్రయత్నించగా.. బీబమ్మ నిరాకరించడం.. మేము ఫిర్యాదు ఇవ్వకుండానే మా ఇంట్లో దొంగలు పడ్డారని ఎవరు చెప్పారని పోలీసులతో వాదించడంతో వారు వెనుదిరిగారు. స్థానికులు మాత్రం బీబమ్మ ఇంట్లో దొంగలు పడ్డారని, ఇంటికి అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డు అయి ఉంటుందని చర్చించుకున్నారు. విషయం తెలుసుకున్న బీబమ్మ గుట్టుచప్పుడు కాకుండా సీసీ కెమెరాలను తీసివేయడంతో కాకుండా.. ల్యాప్‌టాప్‌లను కూడా అక్కడ లేకుండా చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. దొంగతనంపై పోలీసులు ఇంట్లోకి వచ్చి విచారణ చేయడంతోపాటు సీసీ కెమెరాలను పరిశీలిస్తే గుట్టు రట్టు అవుతుందనే భయంతో పోలీసులను ఇంట్లోకి రానివ్వకుండా జాగ్రత్త పడ్డట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటన జరిగిన కొద్దిరోజులకే బీబమ్మ ఆ ఇంటిని వదిలి వెళ్లి ఇప్పటి వరకు రాకపోవడం విశేషం.
  కూపీ లాగుతున్న పోలీస్‌ అధికారులు
  నయీమ్‌కు ఖమ్మం జిల్లాతో ఉన్న అనుబంధంపై ఇంటెలిజెన్స్, ఎస్‌బీ అధికారులు కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది. ఆంజనేయస్వామి ఆలయానికి విరాళాలు ఇచ్చింది నయీమ్‌ అయి ఉంటాడని ప్రచారం కావడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. జిల్లాతో సంబంధం లేని మహిళ.. ఒంటరిగా వచ్చి కాలనీలో ఇల్లు ఎందుకు కొన్నారని, ఆలయానికి లక్షలాది రూపాయల విరాళం ఎందుకు ఇచ్చారని, నాలుగేళ్లుగా సొంత ఇల్లు విడిచి వెళ్లిన ఆమె.. మళ్లీ ఎందుకు రాలేదనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇంటి యజమాని ఎవరో తెలియకుండా.. కనీసం ఇంటి అద్దె కూడా చెల్లించకుండా ఉన్న ఆ ఇంట్లో రహీంతోపాటు ఎవరెవరు ఉంటున్నారు. వారి బంధువులు ఎక్కడ అనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అలాగే గాంధీనగర్‌ కాలనీతో సంబంధం ఉన్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఎవరైనా ఉన్నారా.. ఉంటే వారు ఎక్కడెక్కడ వ్యాపారం చేస్తున్నారు.. ప్రధానంగా హైదరాబాద్, నల్లగొండ, భువనగిరి, షాద్‌నగర్‌ ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో ఏ మేరకు సంబంధాలున్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్, సూర్యాపేట మీదుగా విజయవాడ, ఆంధ్రా ప్రాంతంలోని పలు ప్రాంతాలకు వెళ్తే ఎవరైనా తనిఖీలు.. టార్గెట్‌ చేస్తారనే ఉద్దేశంతో సేఫ్‌జోన్‌గా ఇక్కడ ఉన్న ఇంటిని డెన్‌గా ఏర్పాటు చేసుకున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భువనగిరి, వరంగల్‌ జిల్లా తొర్రూరు, ఖమ్మం మీదుగా విజయవాడ, అక్కడి నుంచి ఆంధ్రాలోని ఏ ప్రాంతానికైనా వెళ్లేందుకు ఎవరికీ అనుమానం రాకుండా షెల్టర్‌ తీసుకోవడానికి ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడా.. అనే చర్చ జరుగుతోంది.  దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని వైరా డీఎస్పీ భూక్యా రాంరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.

  వాళ్లెవరో తెలియదు..
  ఇంటికి బేరం వచ్చిందని అరుణమ్మ చెప్పింది. కారులో నలుగురు మహిళలు.. ఓ వ్యక్తి వచ్చారు. వ్యక్తి మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు కారులోనే ఉన్నాడు. వచ్చిన నలుగురు మహిళలే ఒకేసారి రూ.3.25లక్షలు ఇచ్చారు. అగ్రిమెంట్లు కూడా వెంటనే రాసుకున్నాం. వారెవరో.. ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలవదు. చెరువు మాదారంలో ఇల్లు కొందామనే అప్పట్లో ఆ ఇంటిని అమ్ముకున్నాం.
  – ప్రకాశం, చెరువు మాదారం
   

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు