సిటీలో చిన్నడవి

28 Jun, 2017 05:36 IST|Sakshi
సిటీలో చిన్నడవి

హుస్సేన్‌ సాగర్‌ తీరం అడవి అందాలు సంతరించుకోనుంది. బల్క్‌ ప్లాంటేషన్‌ (పెద్దమొత్తంలో మొక్కలు నాటడం) పద్ధతిలో నెక్లెస్‌ రోడ్‌ ప్రాంతంలో మూడెకరాల విస్తీర్ణంలో 30 వేల మొక్కలు నాటేందుకు రంగం సిద్ధమైంది. ఈ మహత్కార్యాన్ని చేపట్టేందుకు ‘ఫారెస్ట్‌ ఇన్‌ సిటీస్‌’ కాన్సెప్ట్‌తో బెంగళూర్‌కు చెందిన ‘సే ట్రీస్‌’ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు హెచ్‌ఎండీఏతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
– సాక్షి, సిటీబ్యూరో
  
బల్క్‌ ప్లాంటేషన్‌ పద్ధతిలో మూడెకరాల్లో 30వేల మొక్కల పెంపకం
‘ఫారెస్ట్‌ ఇన్‌ సిటీస్‌’ కాన్సెప్ట్‌తో ముందుకొచ్చిన ‘సే ట్రీస్‌’ సంస్థ


సంజీవయ్య పార్కుకు ఆనుకొని పీవీ ఘాట్‌కు ఎదురుగా ఉన్న మూడెకరాల స్థలంలో అడవిని తలపిం చేలా మొక్కలు నాటుతామని ‘సే ట్రీస్‌’ బృందం హెచ్‌ఎండీఏ అధికారులకు తెలిపింది. పీవీ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ల పై వర్టికల్‌ గార్డెనింగ్‌పై అధ్యయనం చేసిన బృందం.. ‘ఫారెస్ట్‌ ఇన్‌ సిటీస్‌’ కాన్సెప్ట్‌ను అధికారులకు వివరిం చింది. సొంత నిధులతో మొక్కలు నాటి, రెండేళ్లు నిర్వహణ బాధ్యతలూ చూసుకుంటామంది.  

ఆకట్టుకునే అడవి అందాలు...  
‘సిటీజనులు అడవి అందాలు చూసే భాగ్యాన్ని కల్పించేందుకు మావంతు ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే దేశంలోని వివిధ నగరాల్లో ఈ విధానానికి శ్రీకారం చుట్టాం. బల్క్‌ ప్లాంటేషన్‌ పద్ధతిలో వివిధ రకాల మొక్కలను దగ్గరదగ్గరగా నాటాలనుకుంటున్నామ’ని సంస్థ వలంటీర్‌ ప్రశాంత్‌ తెలిపారు. రెండేళ్ల నిర్వహణ అనంతరం మొక్కలు బాగా పెరిగాక ప్రజలకు ఇందులోకి అనుమతి ఉంటుందని అర్బన్‌ ఫారెస్ట్రీ అధికారులు పేర్కొంటున్నారు. ఇది పూర్తయి తే సిటీలో ‘చిన్నడవి’ తయారైనట్టే. దీంతో సిటీలో వేడితో పాటు కాలుష్యం కొంతమేర తగ్గే అవకాశం ఉంది.

ఓఆర్‌ఆర్‌ ప్రాంతంలోనూ...  
అవుటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌)లోని నాలుగు ప్రాంతాల్లోనూ ఈ విధానం అమలు చేయాలని అర్బన్‌ ఫారెస్ట్రీ అధికారులు యోచిస్తున్నారు. ఈ మార్గంలో చిన్నపాటి అడవిని రూపొందిస్తే ప్రయాణికులకు ఆహ్లాదభరిత వాతావరణం అందించినట్టే. నానక్‌రామ్‌గూడ–కోకాపేట, పటాన్‌చెరు, బొంగళూరు, శామీర్‌పేట–ఘట్‌కేసర్‌ ప్రాంతాల్లోని ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద ఈ పద్ధతిని ప్రయోగాత్మకంగా అమలుచేసే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

మరిన్ని వార్తలు