మినీ స్టేడియం నిర్మాణానికి మోక్షమెప్పుడో...?

5 Aug, 2016 23:57 IST|Sakshi
మినీ స్టేడియం నిర్మాణానికి మోక్షమెప్పుడో...?
  • క్రీడా మైదానాలు కరువు
  • ఇబ్బందుల్లో క్రీడాకారులు
  • నిధులున్నా నిర్మాణానికి చోచుకోని వైనం
  • చెన్నూర్‌ : అన్నీ ఉన్నా అల్లుని నోట్ల శని అన్న చందంగా మారింది చెన్నూర్‌ క్రీడాకారుల పరిస్థితి. జిల్లాలోనే చెన్నూర్‌ క్రీడాకారులకు పెట్టింది పేరు. ఈ ప్రాంతానికి చెందిన క్రీడాకారులు  జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి జిల్లా పేరును జాతీయ స్థాయిలో నిలిపారు.  క్రీడాకారులకు ఎలాంటి సౌకర్యాలు లేక పోవడంతో వారు పడరాని పట్లు పడుతున్నారు. అన్ని సౌకర్యాలు ఉంటే అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా ఉన్న క్రీడాకారులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ మేరకు సౌకర్యాలు కల్పించడం లేదని పలువురు క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
    మంజూరైనా... మోక్షం లేదు
    క్రీడాకారుల సౌకర్యార్థం ప్రభుత్వం 2013లో నియోజకవర్గానికో మినీ స్టేడియం నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  ఇందు కోసం రూ. 1.25 కోట్ల నిధులు మంజూరు చేసింది. స్టేడియం నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు  జాతీయ రహదారి సమీపంలో స్థలాన్ని కేటాయించారు. దీంతో ఈ ప్రాంత క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేశారు. మినీ స్టేడియం నిర్మాణం అయితే అన్ని రకాల క్రీడలు సాధన చేసేందుకు అనుకూలంగా ఉంటుందని, ఏడాదిలోగా స్టేడియం నిర్మాణం పూర్తి అవుతుందని  సంబర పడ్డారు. స్టేడియానికి  కేటాయించిన స్థలాన్ని ఇంజనీరింగ్‌ అధికారులు పరిశీలించారు.
              ఈ స్థలంలో మినీ స్టేడియం నిర్మాణానికి రూ. 1.25 కోట్లు సరిపోవని సుమారు రూ. 2 కోట్లు అవసరం ఉంటుందని తెలిపారు. అదనపు నిధుల కోసం  ప్రభుత్వానికి తిరిగి ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పినప్పటికీ ఫలితం లేదు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి మూడేళ్లు అవతున్నా నేటికి నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో పలువురు క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకొని స్టేడియం నిర్మాణం అయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. 
     ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానమే దిక్కు
    క్రీడాకారులు ప్రాక్టీస్‌ చేసేందుకు పట్టణంలోని  ప్రభుత్వ ఉన్నత పాఠశాల  మైదానం ఒక్కటే దిక్కైయింది. నియోజకవర్గ కేంద్రంలో ఒక్కటే మైదానం ఉండడంతో కళాశాల, ఉన్నత పాఠశాల విద్యార్థులతో పాటు  క్రీడాకారులందరూ ఒకే చోట సాధన చేయాల్సిన దుస్థితి నెలకొంది. క్రీడాకారులందరూ ఉదయం, సాయంత్రం సమయాల్లో ఒకే సారి రావడంతో  స్థలం కొరత స్పష్టంగా ఏర్పడుతోంది. దీంతో క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు.
            అంతే కాకుండా పట్టణంలోని ఉద్యోగులు, వ్యాపారులు ఉదయం వేళ్లలో వాకింగ్‌ చేసేందుకు ఇదే మైదానానికి వస్తుంటారు. దీంతో మైదానం వివిధ రకాల క్రీడాలను ప్రాక్టీస్‌ చేయడంలో ఏకాగ్రతను కోల్పోవల్సి వస్తోందని సీనియర్‌  క్రీడాకారులు పేర్కొంటున్నారు. మినీ స్టేడియం నిర్మించినట్లయితే  క్రీడాకారులకు సౌకర్యంగా ఉంటుందని క్రీడాకారులు సంపత్, సాగర్, సంతోశ్‌లు పేర్కొంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు క్రీడాకారుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని స్టేడియం నిర్మాణానికి కృషి చేయాలని కోరుతున్నారు. 
     
     
     
>
మరిన్ని వార్తలు