రుసువిల

26 Sep, 2016 02:17 IST|Sakshi
రుసువుల చెరువుకుపడ్డ గండిద్వారా వృథాగా పోతున్న నీరు
  • బిల్లకల్లు చెరువుకు నిర్లక్ష్యపు గండి
  • 15ఏళ్లుగామరమ్మతుకు  నోచని సాగునీటి వనరు
  • రెండుసార్లు రూ.43లక్షలు మంజూరైనా కదలని పనులు
  • పునరుద్ధరణ అటవీశాఖ అధికారుల అభ్యంతరం
  • అచ్చంపేట: నల్లమలలోనే రుసువుల చెరువు అతిపెద్దది. దీనికింద అత్యధికంగా చెంచుగిరిజనుల సాగుభూములు ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 545 ఎకరాలకు సాగునీరు అందుతుండగా.. వాస్తవంగా వెయ్యి ఎకరాలకుపైగా అందిస్తోంది. ఒకసారి నిండితే మూడుపంటలకు ఢోకా ఉండదు. మొదట కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(కేఎల్‌ఐ)ద్వారా నీటినిల్వ సామర్థ్యాన్ని ఐదు టీఎంసీలకు పెంచి అచ్చంపేట, బల్మూర్‌ మండలాలకు సాగునీరు అందించాలని ప్రణాళిక రూపొందించారు. అయితే 15ఏళ్లుగా చెరువుకట్ట మరమ్మతుకు నోచకపోవడంతో పెద్దపెద్ద గండ్లు పడి నీరంతా బయటికి వెళ్లిపోతోంది. ఫలితంగా నీళ్లులేక చెరువు కింద ఉన్న బిల్లకల్లు, కొండనాగుల, లక్ష్మీపల్లి గ్రామాల భూములు బీళ్లుగా మారుతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చెరువులోకి  చేరిన నీరంతా గండిద్వారా వృథాగా చంద్రవాగులోకి వెళ్తోంది. 25 అడుగుల నీటిమట్టం ఉన్న ఈ చెరువు ప్రస్తుతం 16అడుగులకు చేరింది. గండి దిగువన కేవలం ఏడు అడుగుల నీళ్లు మాత్రమే మిగిలే అవకాశం ఉంది. గండి నుంచి వృథాగా పోతున్న నీళ్లను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు.
     
    ఎమ్మెల్యే దృష్టికి సమస్య
    గండిని పూడ్చి తమ పంటపొలాలకు సాగునీరు అందించాలని శనివారం రుసువుల చెరువు సందర్శించిన అచ్చంపేట గువ్వల బాలరాజు ముందు ఆయకట్టు రైతులు తమ గోడు వినిపించారు. ఈ చెరువును అభివృద్ధి చేస్తే రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరడంతో పాటు పులులు, చిరుతలు, ఇతర అటవీజంతువులకు తాగునీరు అందే అవకాశం ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ నీటివనరు మరమ్మతు చేపడితే రైతులు వలసలు వెళ్లకుండా ఉన్నచోటే వారికి ఉపాధి లభిస్తుందని అభిప్రాయపడ్డారు.  
     
    నిధులు మంజూరైనా నిట్టూర్పే!
    2004లో అప్పటి క్రీడలశాఖ మంత్రి పి.రాములు రూ.40లక్షలు మంజూరు చేయించారు. అటవీశాఖ అభ్యంతరం చెప్పడంతో నిధులు వెనక్కివెళ్లాయి. 2005లో రాజీవ్‌పల్లెబాటలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాటి ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ విజ్ఞప్తి మేరకు చెరువు మరమ్మతుకు రూ.43లక్షలు మంజూరుచేశారు. అటవీశాఖ మళ్లీ కొర్రీపెట్టడంతో పనులు ప్రారంభించలేదు. అప్పట్లో టెండర్లు  పిలిచి అగ్రిమెంట్‌ చేసుకున్నా కాంట్రాక్టర్లు వెనకడుగు వేశారు. 
     
    అటవీశాఖ అభ్యంతరం 
    నల్లమల అభయారణ్యంలో చెరువు నిర్మాణం చేపడితే అటవీప్రాంతం నీటì లో మునిగి పర్యావరణానికి ముప్పుఉందని అటవీశాఖ చెబుతోంది. నిజానికి ఈ చెరువును అభివృద్ధిచేస్తే పర్యావరణానికి ముప్పు ఉంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. కేంద్రప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురావడంలో స్థానిక ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని రైతులు మండిపడుతున్నారు. రుసువుల చెరువును అభివృద్ధి చేస్తే పంటలకు సాగునీరు అందుతుందని, అడవిలోని జంతుజాలానికి తాగునీరు లభిస్తుందని వారు సూచిస్తున్నారు. 
>
మరిన్ని వార్తలు