దేవాదాయ కమిషనర్‌ ఆదేశాలు బేఖాతర్‌ !

3 Aug, 2016 23:11 IST|Sakshi
దేవాదాయ కమిషనర్‌ ఆదేశాలు బేఖాతర్‌ !
సాక్షి, విజయవాడ :
 ఇంద్రకీలాద్రిపై మౌనస్వామి దేవాలయం కూల్చివేత విషయంలో దేవాదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాలను సైతం స్థానిక అధికారులు పట్టించుకోలేదు. దుర్గగుడిపై భవానీ మండపం, అన్నదాన భవనంతోపాటు మౌనముని గుడిని కూల్చివేయాలనే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోయారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న నవదుర్గలను కలుపుతూ భవానీ మండపాన్ని నిర్మించారని, 1950 నుంచి 1980 వరకు మౌనముని కొండపై ఉండి దేవాలయ అభివృద్ధితోపాటు అన్నదానం చేశారని వివరిస్తూ టి.విజయకనకదుర్గ శ్రీనివాస్‌ అనే భక్తుడు దేవాదాయశాఖ కమిషనర్‌ అనూరాధకు లేఖ రాశారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న వాటిని కాపాడాలని కోరారు. దీనిపై స్పందించిన దేవాదాయ శాఖ కమిషనర్‌ జూన్‌ నెలలో మౌనస్వామి గుడి జోలికి వెళ్లవద్దని ఉత్తర్వులు జారీచేశారు. అప్పట్లో మౌనస్వామి ఆలయాన్ని కూల్చేందుకు దేవస్థానం అధికారులు సాహసించలేదు. 
స్వయంప్రతిపత్తి వచ్చిన వెంటనే.. 
దుర్గగుడికి స్వయంప్రతిపత్తి వచ్చిన వెంటనే ఈవోకు నిర్ణయాధికారులు వచ్చాయి. దీంతో కమిషనర్‌ ఆదేశాలను బేఖాతర్‌ చేస్తూ మౌనస్వామి గుడిని నేలమట్టం చేశారు. స్వయంప్రతిపత్తి వల్ల దేవాలయ ప్రతిష్ట పెరిగే పనులు చేయాలని, భక్తుల విశ్వాసాలను దెబ్బతీయకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
 
మరిన్ని వార్తలు