అద్దె వసూళ్లలో నిర్లక్ష్యం

31 Aug, 2016 23:10 IST|Sakshi
అద్దె వసూళ్లలో నిర్లక్ష్యం
* వసూలు కాని బకాయిలు రూ.2.56 కోట్లు
నెలవారీ మామూళ్లే కారణం?
బినామీల చేతుల్లో భవనాలు
కార్పొరేషన్‌ ఆదాయానికి భారీగా గండి
 
నెహ్రూనగర్‌: నగరపాలకసంస్థ షాపింగ్‌ కాంప్లెక్స్‌లలోని దుకాణాల అద్దె వసూళ్లలో రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా కార్పొరేషన్‌ ఆదాయానికి కోట్ల రూపాయల్లో గండిపడుతున్నది. నగరపాలక సంస్థకు ఆదాయం తెచ్చే పెట్టే వాటిలో రెవెన్యూ శాఖ కీలకమైనది.  ఈ శాఖ ద్వారా వచ్చే ఆదాయంతో నగరంలో పలు అభివద్ధి పనులు చేపడుతుంటారు. అయితే అధికారులు మామూళ్ల మత్తులో  భవనాల అద్దె వసూళ్ల విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. 
 
నగరంలో 1165 దుకాణాలు..
నగరంలోని ప్రధాన కూడళ్లలో, రద్దీగా ఉండే ప్రాంతాల్లో నగరపాలకసంస్థకు షాపింగ్‌ కాంప్లెక్స్‌లు ఉన్నాయి.  వీటిలో మొత్తం 1165 దుకాణాలు ఉన్నాయి.  25 సంవత్సరాల లీజు పూర్తయి గడువు తీరిన షాపుల్లో తిరిగి రెన్యూవల్‌ చేసుకున్నవి 720, ఇంకా రెన్యూవల్‌ కానివి 399 ఉన్నాయి. గడువు పూర్తయిన షాపులకు తిరిగి వేలం నిర్వహించి కేటాయించాల్సి ఉంది. గడువు తీరిన షాపులకు రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేశారు. కొంతమంది లీజుదారులు కోర్టుకు వెళ్లి అద్దె చెల్లించకుండా చలామణి అవుతున్నారు.  కార్పొరేషన్‌ సమీపంలో నిర్వహిస్తున్న ఓ హోటల్‌ యజమాని ఇలా లక్షల్లో అద్దె ఎగ్గొట్టినట్లు సమాచారం. ఇటువంటి సంఘటనలు నగరంలో అనేకం ఉన్నాయి. అద్దె చెల్లింపు విషయంలో జీవో నెం.56 ప్రకారం స్థానికంగా ఉన్న రిజిస్ట్రేషన్‌ విలువ ఆధారంగా అద్దె నిర్ణయించి వసూలు చేయడం, లేదా ప్రతి మూడేళ్లకోసారి 33 శాతం అద్దె పెంచాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత అర్ధ సంవత్సరం పాత బకాయిలు రూ.3.95 కోట్ల దాకా ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు 1.38 కోట్లు వసూలు కాగా, రూ.2.56 కోట్ల బకాయిలు వసూలు కావాల్సి ఉంది. 
 
అధిక మొత్తంలో  లీజులకు..
షాపులను వేలం ద్వారా లీజుకు దక్కించుకున్నవారిలో కొందరు  వాటిని తర్వాత అధిక మొత్తంలో అద్దె వచ్చే విధంగా సబ్‌ లీజుకు ఇస్తున్నారు. దీంతో అధికారుల బకాయిలు వసూలు చేయడానికి షాపులకు వెళితే లీజుదారులు అందుబాటులో లేకపోవడంతో   వసూళ్లలో జాప్యం జరుగుతోంది. ఇదే అదునుగా తీసుకుంటున్న కొందరూ రెవెన్యూ సిబ్బంది సబ్‌లీజుదారులతో కుమ్మకై అద్దెలు వసూలు చేయకుండా మామూళ్లతో జేబులు నింపుకుంటున్నారని ఉద్యోగుల్లోనే చర్చ జరుగుతుండటం గమనార్హం. కొందరు సబ్‌ లీజుదారులు లీజుదారులకు కాకుండా తమకే షాపును కేటాయించాలని కోరుతున్నారు. 
 
నోటీసులు ఇచ్చినా..
బకాయిదారులకు నోటీసులు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. బకాయిదారులు కొందరు రాజకీయ నాయకుల అండదండలతో అద్దె చెల్లించకుండా స్వంత షాపుల్లా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ అధికారులు కూడా కాసులకు కక్కుర్తి పడి చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు రూ.80లక్షలకు పైగా బకాయిలు ఉన్న లీజుదారులు కొందరు షాపులు ఖాళీ చేసి, ఎగనామం పెట్టి వెళ్లిపోయిన ఘటనలూ ఉన్నాయి.  గడువు తీరిపోయిన షాపులలో కొన్ని లక్షల రూపాయల్లో బకాయిలు ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి కార్పొరేషన్‌ ఆదాయం పెంచే దిశగా చర్యలు తీసుకొవాల్సి ఉంది.
మరిన్ని వార్తలు