నిర్లక్ష్యంలో పెద్దేరు

17 Aug, 2016 17:04 IST|Sakshi
పెద్దేరు ప్రాజెక్టు
కట్టపై రాళ్లపై రావి చెట్లు
రంధ్రాలు పడి దెబ్బతింటున్న నిర్మాణం 
సిబ్బంది పోస్టులన్నీ ఖాళీ 
పట్టించుకోని అధికార యంత్రాంగం 
 
బి.కొత్తకోట:
తంబళ్లపల్లె.. కరువుకు చిరునామా. అక్కడ గుక్కెడు తాగు నీరు గగనమే. అలాంటి ప్రాంతం సస్యశ్యామలం చేయడానికి వర్షపు నీటిని ఒడి పట్టడానికి 1976లో బీజం పడింది. అదే తంబళ్లపల్లె మండలం కొటాల గ్రామానిక సమనీపంలో నిర్మించిన పెద్దేరు ప్రాజెక్టు. ఇది 1981కి పూర్తి అయ్యింది. కర్షకులకు సాగు నీరందించి తంబళ్లపల్లె, పెద్దమండ్యం మండలాల కరువు రైతుల కల్పతరువుగా నిలిచింది. నాటి వరకు సజ్జ సంగటితో సరిపెట్టుకునే అన్నదాతలు వరి అన్నం తినే స్థాయికి ఎదిగారు. అయితే అధికార యంత్రాంగం ఆ ప్రాజెక్టు నిర్వహణ గాలికి వదిలేయడంతో ఆ ఆనందం నీరుగారిపోతోంది. నేడు పెద్దేరు ప్రాజెక్టు నిర్వహణ నిర్లక్షానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది.
 
 తంబళ్లపల్లె నియోజకవర్గంలో తొలి సాగునీటి ప్రాజెక్టు పెద్దేరు. అయితే దీని నిర్వహణపై అధికార యంత్రాంగం పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. నీటి నిర్వహణ, కాలువల యాజమాన్యం కోసం రూ.కోట్లు ఖర్చు చేసినా దుర్భర పరిస్థితులు వీడలేదు. ప్రాజెక్టు నిర్వహణ కోసం ప్రత్యేక వ్యవస్థే ఉన్నా ప్రస్తుతమిది ఏమి చేస్తోందో, అసలు ఉందో లేదో అన్న అనుమానం ప్రాజెక్టు దుస్థితిని చూస్తే కలగకమానదు.
 
 
నిర్వహణ గాలికి వదిలేశారు
రూ.7.98 కోట్లతో నిర్మించిన పెద్దేరు ప్రాజెక్టు నిర్వహణపై జలవనరులశాఖ పట్టించుకోవడం లేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. పూర్తిగా రాయి కట్టడంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకోకపోవడంతో కట్టపై రావిచెట్లు మొలిచి ఏపుగా పెరుగుతున్నాయి. కట్ట పైనుంచి కిందకు పైపుల ఏర్పాటు సందర్భంగా ఏర్పడిన రంధ్రాలను రాళ్లతో పూడ్చారు. కట్ట వెనుక భాగం నెర్రులొచ్చాయి. కట్టపై గోడలకు రంధ్రాలు పడినా వాటిని పట్టించుకోక అలాగే వదిలేశారు. ఇది ప్రాజెక్టు భద్రతపై ప్రభావం చూపించే పరిస్థితులుగా స్పష్టం అవుతున్నా కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. ప్రాజెక్టును చూస్తే పాడుబడినట్టుగా కనిపిస్తుంది. ప్రాజెక్టు నుంచి పొలాలకు సాగునీరు వెళ్లాలంటే కుడి, ఎడమ కాలువలే కీలకం. ఈ కాలువల నిర్వహణ కోసం ప్రభుత్వం ఏటా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా కనీస నిర్వహణ లేదు. కాలువలు మట్టి, రాళ్లతో పూడిపోతున్నాయి. కుడికాలువపై ముళ్లపొదలు పెరిగాయి. అక్కడక్కడ కాలువ కోతకు గురైంది. 
 
 
శిథిలావస్థలో భవనాలు..
ప్రాజెక్టు నిర్వహణ కోసం 1981లోనే పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేశారు. అధికారులు, సిబ్బందిని నియమించారు. వారికోసం ప్రాజెక్టు దిగువన పెద్ద భవనాలు, అతిథి గహలు, కార్యాలయాలు నిర్మించారు. ఉద్యానవనం నిర్వహణ కోసం లష్కర్లను నియమించారు. అయినా ఫలితం శూన్యం. గతంలో ఇక్కడ ఉండాల్సిన పోస్టులన్నీ భర్తీ చేసినప్పటికీ నిర్వహణ చర్యలు అంతంతమాత్రమే. దీంతో ప్రాజెక్టు కళతప్పింది. నిండా నీళ్లున్నా ఎప్పుడూ ప్రాజెక్టు ముందుభాగంలోని ఉద్యానవనాల నిర్వహణ గాలికి వదిలేశారు. ఇప్పడీlప్రాంతం ముళ్లచెట్లు, పొదలతో నిండిపోయింది.  
 
 
’ప్రాజెక్టు పోస్టులన్నీ ఖాళీగానే..
పెద్దేరు ప్రాజెక్టు నిర్వహణ, నీటి యాజమాన్యం కోసం ఒక జేఈ ఉండాలి. ఇతను నిత్యం ప్రాజెక్టును పర్యవేక్షిస్తూ ఉండాలి. ప్రాజెక్టు నిండాక నీటి విడుదల, పంటల సాగు పరిస్థితులకు అనుగుణంగా నీటిని కుడి, ఎడమ కాలువలకు ఏ స్థాయిలో విడుదల చేయాలన్న అంశాలపై పర్యవేక్షణ కొనసాగాలి. అయితే ప్రస్తుతం ఈ పోస్టుకు అధికారిని నియమించలేదు. ప్రస్తుతం పెద్దతిప్పసముద్రం మండల జేఈ సారధి ప్రాజెక్టు ఇన్‌చార్జి జేఈగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక లష్కర్‌ పోస్టులు నాలుగుండగా మూడు పోస్టులు ఖాళీ, ఒక ఎలక్ట్రిషియన్‌ పోస్టు ఖాళీ, ఇద్దరు వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు ఉండాల్సి ఉండగా ఒకరు మాత్రమే ఉన్నారు. వాచ్‌మెన్‌ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. 
 
 
ఇదీ ప్రాజెక్టు స్వరూపం 
తంబళ్లపల్లె మండలం కొటాల గ్రామంలో రెండు కొండల నడుమ పెద్దేరు ప్రాజెక్టుకు 1976 అక్టోబర్‌లో పనులు ప్రారంభించి, 1980 డిసెంబర్‌లో పూర్తి చేశారు. 600 మీటర్ల పొడవు, 35.74 మీటర్ల ఎత్తు కలిగిన ప్రాజెక్టులో నీటిæనిల్వ సామర్థ్యం 793 ఎంసీఎఫ్‌టీలు. తొలిసారి 1981 డిసెంబర్‌ 29న పంటలకు నీటిని విడుదల చేశారు. దీనికింద ఖరీఫ్‌లో 7వేల ఎకరాలు సాగవుతుంది. మొదటి స్టేజిలో కుడికాలువకింద 1,800 ఎకరాలు, ఎడమ కాలువకింద 2,800 ఎకరాలు, రెండో స్టేజీలో 2,700 ఎకరాల ఆయకట్టు సాగుకు నీళ్లిచ్చేలా నిర్ణయించారు. కుడికాలువ 14.60 కిలోమీటర్లు కాగా 65.34 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారు. ఎడమకాలువ 17కిలోమీటర్లు కాగా 40 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారు. 
 
 
జీవితాలు మార్చేసింది
పెద్దేరు ప్రాజెక్టు నిర్మాణంతో మా జీవితాలు మారిపోయాయి. బీడు భూములు సాగులోకి వచ్చాయి. కొర్రలు, సద్దలు తప్ప మరో పంట ఎరుగని మాకు వరి సాగు చేసేలా చేసి, భోజనం తినేలా చేసింది ఈ ప్రాజెక్టే. దీన్ని కట్టకుండా ఉంటే ఇప్పటికీ మా బతుకులు బీడుబారేవి. గత డిసెంబర్‌లో ప్రాజెక్టు నిండటంతో రెండెకరాలు సాగులోకి వచ్చాయి. ఇప్పుడు పంటలు సాగుచేసుకుంటూ ఆర్థికంగా బాగుపడుతున్నాం. 
                            – వై.వెంకటనర్సప్ప, 75ఏళ్ల రైతు, ఇర్రివారిపల్లె
 
 
కపిలతో సాగుచేసే వాళ్లం
పెద్దేరు ప్రాజెక్టు నిర్మాణానికి ముందు పంటలు సాగు చేయాలంటే కపిలతో నీటిని తోడేవాళ్లం. ప్రాజెక్టు వచ్చాక 3 ఎకరాల్లో పంటలు సాగు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకొన్నాం. రాగి,సద్దల సంగటి తీనేవాళ్లం. ఇప్పుడు వరి భోజనం చేస్తున్నాం. ప్రాజెక్టుకు ముందు మా ప్రాంతంలో పెద్ద భూస్వాములు మాత్రమే వరి భోజనం చేసేవారు. ఇప్పుడు సాధారణ రైతులూ వరి భోజనం చేస్తున్నారు. ప్రాజెక్టు కట్టేసమయంలో దీని విలువ తెలియదు. ఇప్పుడు తెలుస్తోంది. 
                              – కే.వెంకటరెడ్డి, 90ఏళ్ల రైతు, ఉప్పలూరివాండ్లపల్లె
మరిన్ని వార్తలు