నిండా నిర్లక్ష్యం

7 Jul, 2016 02:14 IST|Sakshi
నిండా నిర్లక్ష్యం

లక్ష్యసాధనలో విఫలమవుతున్న ప్రభుత్వ ఆస్పత్రులు
21 పీహెచ్‌సీల్లో టీకామందు పంపిణీ 80 శాతంలోపే..
గ్రామీణ ప్రాంతాల్లో రోగాల బారిన పడుతున్న చిన్నారులు

పీహెచ్‌సీల్లో అధ్వానంగా వ్యాక్సినేషన్

పుట్టిన పిల్లలకు ఏడాదిలోపు ఇవ్వాల్సిన టీకామందు పంపిణీ ప్రక్రియ నిర్లక్ష్యానికి గురవుతోంది. వైద్య, ఆరోగ్య శాఖ నిర్లిప్త వైఖరితో నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించలేకపోతోంది. జన్మించిన శిశువుకు ఏడాదిలోపు దాదాపు ఏడు రకాల వ్యాక్సిన్లు ఇస్తారు. వారాలు, నెలలను పరిగణనలోకి తీసుకుని ఏడాదిలోపు వ్యాక్సినేషన్ పూర్తిచేయాలి. ప్రతి పీహెచ్‌సీ పరిధిలో తప్పనిసరిగా వందశాతం లక్ష్యాన్ని సాధించాల్సి ఉండ గా.. గ్రామీణ ప్రాంతాల్లోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ ప్రక్రియ గాడితప్పింది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా :  జిల్లాలో 48 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇవికాకుండా 8 క్లస్టర్ ఆస్పత్రులు, ఒక జిల్లా ఆస్పత్రి, మరో రెండు ప్రాంతీయ ఆస్పత్రులు పనిచేస్తున్నాయి. క్లస్టర్ ఆస్పత్రులు, ప్రాంతీయ ఆస్పత్రులు ఇన్, ఔట్‌పేషంట్ విభాగాల్లో సేవలు అందిస్తుండగా.. పీహెచ్‌సీల్లోని సిబ్బంది మాత్రం క్షేత్రస్థాయిలో క్యాంపులు నిర్వహిస్తూ  సేవలందించాల్సి ఉంటుంది. అదేవిధంగా గ్రామాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియంతా పీహెచ్‌సీల ఆధ్వర్యంలోనే సాగుతుంది. ముఖ్యంగా చిన్నారులకు పంపిణీ చేసే మీజిల్స్, డీపీటీ, బీసీజీ, హెపటైటిస్ బీ తదితర వ్యాక్సిన్ల పంపిణీ బాధ్యత పీహెసీ వైద్యులదే. అయితే జిల్లాలో చాలాచోట్ల వ్యాక్సినేషన్ లక్ష్యాలు నిర్లక్ష్యం బారినపడుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది.

21 ఆరోగ్య కేంద్రాల్లో..
జిల్లాలో 21 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వెనుకబడినట్లు వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గవదబిల్లలు, పొంగువ్యాధి రాకుండా వేసే మీజిల్స్ వ్యాక్సిన్ పంపిణీలో మంచాల, దండుమైలారం, నవాబ్‌పేట , పూడూరు, కీసర, సిద్దలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బాగా వెనకబడి ఉన్నాయి. అదేవిధంగా డిప్తీరియా, కోరింతదగ్గు, ధనుర్వాతం రాకుండా వేసే డీపీటీ వ్యాక్సిన్ పంపిణీలో టంగుటూరు, మేడ్చల్, నాగసముద్రం, బంట్వారం పీహెసీలు అధ్వానంగా ఉన్నాయి.

క్షయవ్యాధి బారిన పడకుండా వేసే బీసీజీ వ్యాక్సిన్ పంపిణీలో షాబాద్, సిద్దలూరు, కీసర, పూడూరు, చేన్గొముల్, బంట్వారం పీహెచ్‌సీలు వెనుకబడి ఉన్నాయి. కాలేయ సంబంధ రోగాలు రాకుండా ఉండేందుకు వేసే హెపటైటిస్ బీ వ్యాక్సిన్ పంపిణీలో టంగుటూరు, మేడ్చల్, నాగసముద్రం, బంట్వారం పీహెచ్‌సీలు అంతంతమాత్రం గానే పనిచేస్తున్నాయి. దీంతో ఆయా పీహెచ్‌సీల వైద్యులకు జిల్లా యం త్రాంగం నోటీసులు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒకేసారి ఏడు రకాల వ్యాక్సిన్లు చిన్నారికి అందిస్తారు. జిల్లా సగటు పురోగతి బాగున్నప్పటికీ.. గ్రామీణ మండలాల్లో మాత్రం కొంత ఆందోళనకరంగానే ఉంది.

మరిన్ని వార్తలు