నేలచూపులు

9 Sep, 2016 23:06 IST|Sakshi
నేలచూపులు
భీమవరం : జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చతికిలపడింది. కొత్త రాష్ట్రాన్ని అన్నివిధాలా అభివద్ధి చేస్తామని.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబెడతామని.. అన్ని స్థానాలు ఇచ్చిన పశ్చిమగోదావరి జిల్లాను అభివద్ధిలో అగ్రభాగాన నిలబెడతామని పాలకులు నమ్మబలకడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఉత్సాహంతో జిల్లావ్యాప్తంగా కొత్త వెంచర్లు వేశారు. చివరకు అభివద్ధి అంతా నూతన రాజధాని అమరావతి ప్రాంతానికే పరిమితం కావడంతో రెండేళ్లుగా జిల్లాలో స్థలాల కొనుగోళ్లు, అమ్మకాలు స్తంభించిపోయాయి. ఫలితంగా కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టి భూములు కొనుగోలు చేసిన వ్యాపారులు దారుణంగా దెబ్బతిన్నారు. స్థలాలు అమ్ముడుకాకపోవడంతో రియల్‌ ఎస్టేట్‌ భూముల్లో యూకలిప్టస్‌ తోటలు వేయడం, కూరగాయలు, ఆకు కూరలు పండించడం చేస్తున్నారు. ఒక్క ‘పశ్చిమ’లోనే గడచిన రెండేళ్లలో రూ.వెయ్యి కోట్లకు పైగా లావాదేవీలు నిలిచిపోయాయని అంచనా.
రాష్ట్ర నూతన రాజధాని గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం వంటి నగరాల్లో ఏర్పాటు చేయబోతున్నామంటూ టీడీపీ  నాయకులు విస్తతంగా ప్రచారం చేశారు. జిల్లా కేంద్రమైన ఏలూరు సమీపంలో రాష్ట్ర రాజధాని ఏర్పాటైతే అభివద్ధిలో మన జిల్లా ముందుకు దూసుకుపోతుందని భావించారు. ఇక్కడి గహాలకు ఎక్కడాలేని డిమాండ్‌ ఏర్పడుతుందని ప్రచారం సాగింది. దీంతో ఏలూరుతోపాటు  భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు, జంగారెడ్డిగూడెం తదితర పట్టణాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి ఊపు వచ్చింది.
– విపరీతంగా పెరిగిన ధరలు
రాష్ట్ర రాజధాని ఇక్కడకు సమీపంలోనే ఉంటుందన్న ప్రచారంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు భారీ మొత్తాలు వెచ్చించి ఈ ప్రాంత భూముల్ని కొనుగోలు చేశారు. భీమవరం పరిసర గ్రామాల్లో ప్రధాన రహదారి వెంబడి ఉండే వ్యవసాయ భూముల ధర గతంలో ఎకరం రూ.25 లక్షల లోపు మాత్రమే ఉండేది. రాజధాని పేరుతో ఎకరం రూ.కోటి నుంచి రూ.3 కోట్ల వరకు పెరిగిపోయింది. ఇక పట్టణ పరిసర ప్రాంతాల్లో అయితే గజం భూమి రూ.లక్ష వరకు చేరింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎకరాన్ని రూ.కోటికి కొని, వాటిని పూడ్చి, ప్లాట్లుగా విభజించి అమ్మకానికి పెట్టేసరికి ఎకరం విలువ రూ.2 కోట్ల వరకు అయ్యింది. సెంటు భూమిని రూ.2.25 లక్షలకు విక్రయించగలిగితే వ్యాపారులకు పెట్టుబడి వచ్చేది. కానీ.. ఆ మాత్రం ధరకు కొనేందుకు ఎవరూ ముందుకురాని పరిస్థితి.
నిలిచిపోయిన లావాదేవీలు
జిల్లాలో సుమారు 4వేల మంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులుండగా, దాదాపు 8 వేల ఎకరాల్లో ప్లాట్లు వేసినట్లు అంచనా. వీటిలో 60 శాతం ప్లాట్లు అమ్ముడు కాలేదని చెబుతున్నారు. భూముల ధరలు పెరిగిపోగా, ఖర్చులు కూడా అదేస్థాయిలో అయ్యాయి. దీనివల్ల ధరలు పెంచాల్సి వచ్చిందని రియల్టర్లు చెబుతున్నారు. రాష్ట్ర రాజధానిని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏర్పాటు చేయడంతో ఇక్కడి స్థలాలను కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీనికి తోడు రిజిస్ట్రేషన్‌ చార్జీలు విపరీతంగా పెరిగిపోవడంతో స్థలాల కొనుగోలు తలకు మించిన భారంగా మారింది. ఫలితంగా అమ్మకాలు జరక్క ఎక్కడి ప్లాట్లు అక్కడే నిలిచిపోయాయి. 
 వడ్డీలు కట్టలేక సతమతం
రియల్టర్లలో అత్యధికులు పెట్టుబడుల నిమిత్తం వడ్డీ వ్యాపారుల నుంచి నిధులు సమీకరించారు. స్థలాల అమ్మకాలను త్వరితగతిన పూర్తిచేసి సొమ్ము చేసుకోవచ్చని ఆశించారు. స్థలాల కొనుగోళ్లు జరక్కపోవడంతో అప్పు తెచ్చిన సొమ్ములకు వడ్డీలు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. కొందరైతే సొంత ఆస్తులను సైతం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాజధాని కుంగదీసింది
 రాష్ట్ర రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేయడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ముందుగా ఆప్రాంతంలో భూములు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు. అక్కడ అనుకున్న స్థాయిలో అమ్మకాలు జరగడం లేదు. ఇదే తరుణంలో మన జిల్లాలో కూడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ముందుకు సాగడం లేదు. కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి వెంచర్లు వేస్తే కొనుగోళ్లు జరగక వడ్డీలు కూడా కట్టలేక సతమతమయ్యే పరిస్థితి ఏర్పడింది. 
– తోట భోగయ్య, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, భీమవరం
 ధరలు పెరిగిపోయాయ్‌
రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌లో వ్యాపారం చేసుకునే వారు ఇక్కడికొచ్చి భూముల ధరలను విపరీతంగా పెంచేశారు. దీనితో స్థలాల ధరలు కూడా పెరిగిపోయాయి. సొంత ఇంటి కోసం కొద్దిపాటి స్థలం కొనాలన్నా లక్షలకు లక్షలు పెట్టాల్సి వస్తోంది. అందువల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజలు, చిరుద్యోగులు, చిరు వ్యాపారులకు సొంత ఇంటి కల కలగానే మిగిలిపోతోంది. – కట్టా శ్రీనివాస్, వీరవాసరం
 
మరిన్ని వార్తలు