దోపిడీయే అజెండా

24 Oct, 2016 01:23 IST|Sakshi
దోపిడీయే అజెండా
  •  ప్రజా సమస్యలను చేర్చని వైనం
  •  మూడు నెలలకోసారి నిర్వహించాల్సిన కౌన్సిల్‌ ఏడాదికి
  • అవినీతి, అక్రమాలపై ప్రతిపక్షం నిలదీస్తుందని వెనుకడుగు
  • ఈ నెల 28న సమావేశం
  •  
    నెల్లూరు సిటీ: నెల్లూరు కార్పొరేషన్లో అవినీతి, అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండాపోయాయి. అధికార పార్టీ నాయకులు తమ స్వలాభం కోసం అజెండాను తమకు అనుకూలంగా మలుచుకున్నారనే విమర్శలు ఉన్నాయి. నెల్లూరు నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశాన్ని గతేడాది నవంబర్‌ రెండన నిర్వహించారు. ప్రజాసమస్యలను ప్రతిపక్షం గొంతుగా కౌన్సిల్లో వినిపించేందుకు సైతం మేయర్‌ అజీజ్‌ అడ్డుకట్టవేశారు. దీంతో ఇప్పటి వరకు దాదాపు ఏడుసార్లు కౌన్సిల్‌ తేదీలను మార్చారు. మంత్రి నారాయణ ఇటీవల ఓ సమావేశంలో 19వ తేదీన కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అయితే మేయర్‌ అజీజ్‌ మంత్రి ప్రకటించిన తేదీని మార్చాలని అధికారులను ఆదేశించారని సమాచారం. ఎట్టకేలకు ఈ నెల 28న కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే కౌన్సిల్‌ అజెండాలో ప్రజాసమస్యలు పరిష్కారంపై అంశాలను చేర్చకపోవడం గమనార్హం.
    ఆర్థిక లావాదేవీలకే పెద్దపీట
    నగరపాలక సంస్థ పరిధిలో రిజర్వ్‌డ్‌ స్థలాలను దోచుకునేందుకు అధికార పార్టీ నాయకులు రంగంలోకి దిగారు. రూ.కోట్లు విలువజేసే స్థలాలను కాజేసేందుకు అజెండాలో అంశాలను ప్రతిపాదించారు. కొందరు కార్పొరేటర్లు, నాయకులు రిజర్వ్‌డ్‌ స్థలాల కబ్జాకు అనుకూలంగా ఉంటున్నారు. ఈ క్రమంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని తెలుస్తుంది. ఓ అధికార కార్పొరేటర్‌ లక్ష్మీపురంలోని స్థలాన్ని గత కౌన్సిల్లో వ్యతిరేకించారు. దీంతో అప్పటి కౌన్సిల్‌ ఆ అంశాన్ని అంగీకరించలేదు. అయితే ఇటీవల ఆ కార్పొరేటర్‌కు భారీగా ముట్టడంతో ప్రస్తుతం ఈ అంశానికి ఆమోదం తెలిపేందుకు రంగం సిద్ధం చేశారు.
    రొట్టెల పండగలో నిధుల దోపిడీ
    రొట్టెల పండగలో అధికార పార్టీ నాయకులు రూ.30 లక్షల దోపిడీ చేశారని కార్పొరేషన్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. మేయర్‌కు అత్యంత ముఖ్య అనుచరులు ఇద్దరు, కాంట్రాక్టర్లు కీలక పాత్ర వహించారు. పారిశుధ్యం, నీటి సరఫరా, వసతులు కల్పించేందుకు దాదాపు రూ.1.2 కోట్లను ఖర్చు పెట్టారు. పారిశుధ్య కార్మికుల నియామకంలో భారీగా దోచుకున్నారని తెలుస్తోంది. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, వసతుల ఏర్పాట్లలో కాంట్రాక్టర్లు జేబులు నింపుకొన్నారు. రూ.1.2 కోట్ల మంజూరుకు ఆమోదం తెలపాలని కౌన్సిల్‌ అజెండాలో పెట్టారు.
    ప్రజా సమస్యలు గాలికి
    కార్పొరేషన్‌ పరిధిలో ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కుక్కలు, పందుల బెడద తీవ్రంగా ఉంది. గతేడాది కురిసిన భారీ వర్షాలకు అనేక మంది ఇళ్లు కోల్పోయినా వారికి తగిన న్యాయం జరగలేదు. నగరంలోని కాలువలపై ఆక్రమణల తొలగింపుపై ప్రభుత్వం చేపడుతున్న నిర్ణయంపై అంశాన్ని చేర్చలేదు. ఇలా అనేక సమస్యలను అంశాలుగా చేర్చాల్సిన పాలక వర్గం కేవలం దోపిడీనే ప్రధాన అజెండాగా ఉంచింది.
     
     
మరిన్ని వార్తలు