నెట్టింట్లో.. నెల్లూరు పోలీస్‌!

21 Jul, 2016 21:37 IST|Sakshi
నెట్టింట్లో.. నెల్లూరు పోలీస్‌!
  • సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు చేరువ.. నేరాలకు అడ్డుకట్ట
  • స్కైప్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్, యూట్యూబ్‌ ప్రారంభం
  • ఎస్పీ విశాల్‌గున్నీ
  • ప్రజలకు మరింత చేరువై, నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు నెల్లూరు పోలీసులు శ్రీకారం చుట్టారు. అందుకు ప్రస్తుతం విస్తరించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకున్నారు. యూటూబ్, ట్విట్టర్‌ తదితర యూప్‌లో అందుబాటులో ఉంటూ నేరాల నియంత్రణకు నడుంబిగించారు. 
    నెల్లూరు(క్రైమ్‌):
    పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువచేసేందుకు చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక  పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ నేరాలకు అడ్డుకట్టవేస్తున్నామన్నారు. గురువారం ఆయన తన చాంబర్‌లో ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్, యూట్యూబ్‌తో పాటు రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా స్కైప్‌ వీడియో కాలింగ్‌ సిస్టమ్‌లను ప్రారంభించారు.  
    వాట్సాప్, ఎస్పీ ఫేస్‌బుక్‌తో చేరువ:  
    పబ్లిక్‌ ఐ(వాట్సప్‌), ఎస్పీ ఫేస్‌బుక్, డయల్‌యువర్‌ ఎస్పీలను ప్రారంభించారు. వాటికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. ఎస్పీ ఫేస్‌బుక్‌కు 20వేల మంది ఫాలోవర్స్‌తో రాష్ట్రంలోనే జిల్లా రెండోస్థానంలో నిలిచిందని చెప్పారు. పబ్లిక్‌ వాట్సప్‌కు ఇప్పటి వరకు 294 ఫిర్యాదులు అందగా అందులో 24 ఎఫ్‌ఐఆర్‌లు చేశామనీ, 241 సమస్యలను పరిష్కరించామని, 29 సమస్యలు పరిష్కరించాల్సి ఉందన్నారు. ఐక్లిక్‌కు 188 ఫిర్యాదులు అందగా అందులో 29 ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, 136 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. 23 ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. 
    అసాంఘిక శక్తులపై నిఘా:
    • అసాంఘిక కార్యక్రమాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, ట్రాఫిక్‌ సమస్యలు, వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు మేసేజ్, ఫొటోలు, వీడియోలను వాటికి పంపవచ్చన్నారు.
    • ఏదైనా నేరం జరిగిన వెంటనే సంఘటనా స్థలం నుంచే ఫొటోలు, వీడియోలు పంపితే 
    • నేరపరిశోధన ఉపయోగ పడతాయి. 
    రాష్ట్రంలో మొట్టమొదటిగా స్కైప్‌ విడియో కాలింగ్‌ ప్రారంభం:
    విదేశాల్లో ఉన్న జిల్లా వాసుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్కైప్‌ వీడియో కాలింగ్‌ సేవలను తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సేవలను ప్రజలు వినియోగించుకుని నేరనియంత్రణలో భాగస్వాములు కావాలన్నారు.  
    జిల్లా అంతటా ఈచలానా:
     ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామన్నారు. అందులో భాగంగా నెల్లూరు నగరంతో పాటు కావలి, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేటల్లో ఈచలానా విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ విధానంపై సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తుండటంతో ఫిర్యాదులు తగ్గుముఖం పట్టాయన్నారు.  
    ఫిర్యాదులు, సమాచారం ఇవ్వండిలా..  
    స్మార్ట్‌ఫోన్‌ ఉన్న వారు ట్విటర్‌లో ఫిర్యాదులు, సమాచారం ఎస్పీ నెల్లూరు ఖాతాకు, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో  ఎస్పీ నెల్లూరు ఖాతాకు,  యూట్యూబ్‌ చానల్‌లో నెల్లూరు పోలీసు ఖాతాకు, స్కైప్‌లో(ఎస్పీ అండర్‌స్కోర్‌ నెల్లూరు)ఖాతాకు చేయాలి. అనంతరం ఆయన కమాండ్‌కంట్రోల్‌ ఏర్పాటు పనులను పరిశీలించారు. సమావేశంలో ఏఎస్పీ బి.శరత్‌బాబు, ఎస్‌బి, నెల్లూరు నగర, రూరల్‌ డీఎస్పీలు విక్రమ్‌శ్రీనివాస్, జి. వెంకటరాముడు, డాక్టర్‌ కె.తిరుమలేశ్వర్‌రెడ్డి, ఎస్‌బీ, పీసీఆర్‌ ఇన్‌స్పెక్టర్‌లు మాణిక్యరావు, సంగమేశ్వరరావు, ఎస్‌బీ ఎస్‌ఐ బి. శ్రీనివాసరెడ్డి, ఐటీకోర్‌టీం ఇన్‌చార్జ్‌ రవిప్రసాద్‌ పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు