నేత్రపర్వం.. సహస్ర ఘటాభిషేకం

28 Aug, 2016 20:32 IST|Sakshi
నేత్రపర్వం.. సహస్ర ఘటాభిషేకం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల క్షేత్రపాలకుడు భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో శివదేవునికి ఆదివారం సహస్ర ఘటాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలంటూ ఈ కార్యక్రమాన్ని చినవెంకన్న దేవస్థానం నిర్వహించింది. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మణిక్యాలరావు ఆదేశాల మేరకు ఈనెల 26 నుంచి జరుగుతున్న వరుణ జపాలు ఆదివారం ఆలయంలో జరిగిన విశేష పూజాధి కార్యక్రమాలతో ముగిశాయి.
ముందుగా ఆలయ మండపంలో రుద్రాక్ష మండపాన్ని ఏర్పాటు చేసి గంగా, పార్వతీ సమేత శివదేవుని ఉత్సవమూర్తులను ఉంచి విశేష అలంకరణ చేశారు. పక్కన ఋష్యశంగ ప్రధాన మండప దేవుడ్ని ఏర్పాటుచేశారు. అనంతరం దేవతామూర్తుల ముందు 1,296 కలశాలను ఉంచి పూజాధికాలు ప్రారంభించారు. ఆలయ పండితులు, అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ ఋష్యశృంగ సహిత ప్రధాన మండపారాధన, మహన్యాసం, పంచద్రవ్యారాధన, పంచామత స్నపన, దశవిదస్నానాలు, వారుణానువాక శతానువాదం సహిత శతరుద్రాభిషేకాలు చేశారు. తర్వాత మేళతాళాలు, మంగళవాయిద్యాలు, పండితులు, అర్చకుల వేదమంత్రాల నడుమ గర్భాలయంలో కొలువైన శివదేవుని లింగస్వరూపం నీటిలో మునిగే వరకు కలశాల్లోని జలాలతో అభిషేకించారు. అనంతరం ఋష్యశంగ సహిత వరుణ హోమాలు జరిపి, నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించారు. ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు దంపతులు పాల్గొన్నారు. 
 
 
 
మరిన్ని వార్తలు