నేత్ర పర్వం.. శ్రీవారి రథోత్సవం

11 May, 2017 00:08 IST|Sakshi
నేత్ర పర్వం.. శ్రీవారి రథోత్సవం
ద్వారకాతిరుమల : సమ్మోహిత రూపంతో భక్తులకు అభయహస్తమిస్తూ చినవెంకన్న ఉభయదేవేరులతో రథవాహనంపై తిరువీధుల్లో విహరించారు. ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి శ్రీవారి రథరంగ డోలోత్సవం కనుల పండువగా నిర్వహించారు. రథంపై శ్రీదేవి, భూదేవిలతో స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీహరి కళాతోరణంలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. 
వైభవోపేతంగా రథరంగ డోలోత్సవం 
శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం జరిగిన మరుసటి రోజు రథోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తోంది. బ్రహ్మోత్సవాల సమయంలో రథవాహనం ద్వారా భక్తులు స్వామికి సేవచేసుకునే అవకాశం లభించింది. బుధవారం రాత్రి ఆలయంలో ఉభయ దేవేరులతో శ్రీవారిని తొళక్కం వాహనంపై ఉంచి పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం రథంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై కల్యాణమూర్తులను ఉంచి హారతులిచ్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, విచిత్ర వేషధారణలు, డప్పువాయిద్యాలు, కోలాటభజనలతో శ్రీవారి రథం  క్షేత్ర పురవీధుల్లో తిరుగాడింది. ఆలయ ఫౌండర్‌ ట్రస్టీ ఎస్వీపీజే గోపాలరావు, ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు దంపతులు రథానికి బలిహరణ సమర్పించిన అనంతరం రథయాత్ర ప్రారంభమైంది. ఈఓ త్రినాథరావు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. 
మురళీకృష్ణుడిగా
మురళీకృష్ణుడి అలంకారంలో చినవెంకన్న బుధవారం భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి ఆలయంలో జరుగుతున్న వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలు సందర్భంగా స్వామివారు రోజుకో అలంకారంలో భక్తులను కటాక్షిస్తున్నారు. ఈ క్రమంలో స్వామివారు పిల్లనగ్రోవి ధరించి, గోవులను సంరక్షించే మురళీకృష్ణుడిగా భక్తులకు కనువిందు చేశారు. 
బ్రహ్మోత్సవాల్లో నేడు
 ఉదయం 10 గంటలకు  భక్తి రంజని
 ఉదయం 10.30 గంటలకు అపబృదోత్సవం
 మధ్యాహ్నం 3 గంటల నుంచి వేద సదస్సు
 సాయంత్రం 5 గంటలకు కూచిపూడి నృత్య ప్రదర్శనలు 
 రాత్రి 7 గంటల నుంచి పూర్ణాహుతి, మౌనబలి, ధ్వజారోహణ
  రాత్రి 8 గంటల నుంచి  బుర్రకథ ప్రదర్శన
  రాత్రి 8 గంటల నుంచి  అశ్వవాహనంపై గ్రామోత్సవం
 
 
మరిన్ని వార్తలు