తిరుమలలో కొత్త బూందీ పోటు

12 Jun, 2016 03:21 IST|Sakshi
తిరుమలలో కొత్త బూందీ పోటు

భక్తులు కోరినన్ని లడ్డూలివ్వాలని టీటీడీ యోచన

 సాక్షి, తిరుమల: తిరుమలలో పెరుగుతున్న లడ్డూ డిమాండ్‌కు అనుగుణంగా ఆలయం వెలుపల కొత్త బూందీ పోటు నిర్మించాలని టీటీడీ భావిస్తోంది. శ్రీవారి ఆలయంలో రోజూ 2 నుంచి 3 లక్షలు, రద్దీ రోజుల్లో 3 నుంచి 4 లక్షల వరకు లడ్డూలు తయారు చేస్తున్నారు. దీనివల్ల లడ్డూకు అవసరమైన బూందీ తయారు చేయటానికి ఆలయం వెలుపల బూందీ పోటు చాలటం లేదు. ఇక్కడ కేవలం 40 గ్యాస్‌స్టౌలు ఉన్నాయి. వీటి ద్వారా భక్తుల డిమాండ్‌కు తగ్గట్టుగా బూందీ తయారీ సాగటం లేదు.

అయినప్పటికీ నిర్విరామంగా సాగిం చటం వల్ల అనుకోని అగ్నిప్రమాదాలు ఎదురయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయం వెలుపల ప్రస్తుతం ఉన్న బూందీ పోటుకు అనుబంధంగా సరికొత్త శాస్త్రీయ, సాంకేతిక పద్ధతులతో కొత్త బూందీ పోటు నిర్మించాలని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు యోచిస్తున్నారు. ఇందులో భాగంగా నిపుణుల బృందం సలహాలు తీసుకోవటంలో నిమగ్నమయ్యారు. త్వరలోనే కొత్త బూందీ పోటు నిర్మాణం పనులు సాగించే అవకాశం ఉంది. కొత్త బూందీ పోటు నిర్మాణం పూర్తయితే భక్తులు కోరినన్ని లడ్డూలు ఇచ్చే అవకాశం ఉంది.

 బూందీ పోటుకు కొత్త పైకప్పు నిర్మాణం పూర్తి
 శ్రీవారి ఆలయం వెలుపల అగ్నిప్రమాదానికి గురైన బూందీ పోటులో శనివారం మరమ్మతు పనులు పూర్తి చేశారు. ఎగిసిపడిన మంట లకు కాలిన పైకప్పును పూర్తిగా తొలగిం చారు. కాలిన యంత్రాలు, విద్యుత్ వైర్లు, రేకులు, పనిముట్లు కూడా తొలగించారు. దాని స్థానంలో కొత్త రేకులతో పైకప్పు నిర్మాణం పూర్తి చేశారు. దీంతో ఇక బూందీ తయారీ నిర్విరామంగా కొనసాగనుంది. ఈ పనులను శనివారం ఈవో పరిశీలించారు.

మరిన్ని వార్తలు