ఆందోళనలు ఉధృతం

25 Aug, 2016 22:50 IST|Sakshi
ఆందోళనలు ఉధృతం
  • సిరిసిల్ల జిల్లా, కోరుట్ల డివిజన్‌ కోసం కొనసాగుతున్న పోరు 
  •  కోరుట్ల/సిరిసిల్ల : కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా, సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలని కోరుతూ కొద్ది రోజులుగా జరుగుతున్న ఆందోళనలు ఉధతమయ్యాయి. కోరుట్లలో జాతీయ రహదారి దిగ్బంధం సందర్భంగా బుధవారం ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని నిరసిస్తూ గురువారం పట్టణ బంద్‌ నిర్వహించారు. వ్యాపార, వ్యాణిజ్య సంస్థలు, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలు బంద్‌ పాటించి కోరుట్ల డివిజన్‌ కోసం సంఘీభావం ప్రకటించాయి. కోరుట్ల డిపో ఆర్టీసీ బస్సులు నడవలేదు. గురువారం పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను మోహరించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం జగిత్యాల డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌ కోరుట్లలో పరిస్థితిని సమీక్షించి నిరసన కార్యక్రమాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని అనవసరమైన ఆందోళనకు దిగవద్దని సూచించారు. 
    ఆగని నిరసనలు..
    డివిజన్‌ సాధన సమితి అ«ధ్వర్యంలో జాతీయ రహదారిపై కష్ణాలయం వద్ద మహిళలు రాస్తరోకో నిర్వహించి బతుకమ్మలు ఆడారు. సుమారు గంట సేపు బస్సులు, ఇతర వాహనాలు రాకపోకలు నిలిపోయాయి. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరిన మహిళలు పాత మున్సిపల్‌ కార్యాలయం వద్ద మరోసారి ఆందోళనకు దిగారు. టీడీపీ అధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించి బస్టాండ్‌ వద్ద రాస్తారోకో నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల ముఖచిత్రంతో ఉన్న మాస్క్‌లు ధరించిన కొందరు చెప్పులతో కొట్టుకుని నిరసనలు తెలిపారు. వంటావార్పు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనం పాల్గొన్నారు.   
    సిరిసిల్లలో కాగడాల ప్రదర్శన  
    సిరిసిల్ల జిల్లా కోసం జేఏసీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి కాగడాల ప్రదర్శన నిర్వహించారు. కొత్త బస్టాండు నుంచి అంబేద్కర్‌ విగ్రహం మీదుగా నేతన్న చౌక్‌ వరకు కాగడాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలని అఖిలపక్షం, జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల జిల్లాను ప్రకటించేలా చూడాలని అఖిలపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. జిల్లా సాధించే దాకా పోరాటం సాగిస్తామని ప్రకటించారు. కోర్టు సమీపంలో మంత్రి కేటీఆర్‌ ఫ్లెక్సీని దహనం చేసేందుకు రాగుల రాములు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు జేఏసీ నాయకులకు వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ.. జేఏసీ నాయకులు నేతన్న విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు. పోలీస్‌ జులుం నశించాలంటూ నినాదాలు చేశారు. సిరిసిల్ల సీఐని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సిరిసిల్లలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు తీరుపై జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న కాగడాల ప్రదర్శనను పోలీసులు విచ్ఛిన్నం చేసేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. రాత్రి వరకు రాస్తారోకో కొనసాగింది.
     
    కేటీఆర్‌ సిరిసిల్ల ద్రోహిగా మారొద్దు
    – ఓయూ జేఏసీ నేత దరువు ఎల్లన్న
    మంత్రి కె.తారకరామారావు సిరిసిల్ల ద్రోహిగా మారొద్దని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత దరువు ఎల్లన్న కోరారు. సిరిసిల్లలో గురువారం రాస్తారోకో, ప్రదర్శన నిర్వహించారు. అన్ని అర్హతలు ఉన్న సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరారు. అందరు ఐఖ్యంగా ఉద్యమిస్తే సాధ్యమవుతుందన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను గుర్తించి, ఆత్మగౌరవాన్ని కాపాడాలన్నారు. కాంగ్రెస్‌ నాయకులు కేకే.మహేందర్‌రెడ్డి, జేఏసీ నాయకులు రమాకాంత్‌రావు, కత్తెర దేవదాస్, ఆడెపు రవీందర్, మహేశ్‌గౌడ్, రాగుల రాములు, బుస్సా వేణు, యాదగిరి, సిరిసిల్ల జిల్లా సాధన సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లారీలతో ర్యాలీ నిర్వహించారు. 
మరిన్ని వార్తలు