వరంగల్‌ రీజియన్‌లోనే కొత్త జిల్లాలు

19 Sep, 2016 00:10 IST|Sakshi
వరంగల్‌ రీజియన్‌లోనే కొత్త జిల్లాలు
  • అదనంగా యాదగిరి, హుజూరాబాద్‌ డిపోల చేరిక
  • ఖమ్మం రీజియన్‌లోకి మహబూబాబాద్‌, తొర్రూరు డిపోలు
  • హన్మకొండ : జిల్లాల పునర్విభజనతో ఆర్టీసీలో స్వల్ప మార్పులు జరగనున్నాయి. ప్రస్తుత రీజియన్‌లోని కొత్త జిల్లాల్లో ఆర్టీసీ సేవలు అందించనుంది. కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్నా ఆ మేరకు నూతనంగా డిపోలు ఏర్పాటు కావడంలేదు. దీంతో ప్రస్తుత రీజియన్‌లోని కొత్త జిల్లాల్లోనే డిపోలు తమ కార్యకలాపాలు కొనసాగించనున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం జిల్లాను యూనిట్‌గా ఆర్టీసీ పరంగా రీజియన్‌గా పరిగణిస్తున్నారు. వరంగల్‌ జిల్లాలో (రీజియన్‌లో) ప్రస్తుతం 9 డిపోలు ఉన్నాయి. హన్మకొండలో వరంగల్‌-1, వరంగల్‌-2, హన్మకొండ డిపోలు ఉన్నాయి. జనగామ, పరకాల, నర్సంపేట, తొర్రూరు, మహబూబాబాద్, భూపాలపల్లిలో ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడనున్న హన్మకొండ జిల్లాలోకి హన్మకొండలోని వరంగల్‌-1, వరంగల్‌-2, హన్మకొండ డిపోలతోపాటు, కొత్తగా హుజూరాబాద్‌ డిపో రానుంది. వరంగల్‌ జిల్లాలో పరకాల, నర్సంపేట డిపోలు ఉంటాయి. ఇక జయశంకర్‌ (భూపాలపల్లి) జిల్లాలో భూపాలపల్లి డిపో ఉంది. మహబూబాబాద్‌ జిల్లాలో మహబూబాబాద్, తొర్రూరు డిపోలు ఉంటాయి. ప్రస్తుతం వరంగల్‌ రీజియన్‌లో ఉన్న జనగామ డిపో ప్రాంతం యాదాద్రి జిల్లాలో కలువనుండగా, ప్రస్తుతం కరీంనగర్‌ జిల్లాలో ఉన్న హుజూరాబాద్‌ డిపో ప్రతిపాదిత హన్మకొండ జిల్లాలోకి వస్తుంది. హన్మకొండ - హైదరాబాద్‌ రూట్‌ ఒకే రీజియన్‌ పరిధిలోకి తీసుకురావాలనే ఆలోచనలో ఆర్టీసీ యాజమాన్యం ఉంది. దీంతో ప్రతిపాదిత యాదాద్రి జిల్లాలోని యాదగిరి గుట్ట డిపో, జనగామ డిపో వరంగల్‌ రీజియన్‌లోనే ఉంచాలనే ఆర్టీసీ యాజమాన్యం యోచిస్తోంది. హుజూరాబాద్‌ నుంచి మొదలుకుంటే హైదరాబాద్‌ వరకు ఒకే రీజియన్‌ పరిధిలో ఈ రూట్‌ ఉండడం ద్వారా పర్యవేక్షణతోపాటు బస్సుల ఫ్రీక్వెన్షీ పరంగా నిర్ణయం తీసుకోవడం సులువవుతుందనే ఆలోచనతో ఆర్టీసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పాలనాపరంగా యాదగిరిగుట్ట, జనగామ డిపోలకు వరంగల్‌ కేంద్రంగా ఉండడం అనుకూలంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌ రూట్‌లో ప్రధానంగా ప్రస్తుత వరంగల్‌ జిల్లా పరిధిలోని బస్సులే అధికసంఖ్యలో నడుస్తున్నాయి. వరంగల్‌ జిల్లాలో విభజించిన నాలుగు జిల్లాల్లో వరంగల్‌ రీజియన్‌ పరిధిలోని బస్సులే ఈ రూట్‌లో నడుస్తాయి. ఇతర రీజియన్ల బస్సులకు ఏమాత్రం అవకాశం లేదు. ఈ క్రమంలో ఈ రూట్‌ను ఒకే గొడుగు కింద ఉండేలా యాదగిరిగుట్ట, జనగామను వరంగల్‌లో రీజియన్‌లో కొనసాగించాలనేది ఆర్టీసీ యాజమాన్యం ఆలోచన. రీజియన్‌లోకి యాదగిరిగుట్ట, హుజూరాబాద్‌ డిపోలు రానుండగా, కొత్త జిల్లాల ఏర్పాటుతో మహబూబాద్‌ జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు డిపోలు ఖమ్మం రీజియన్‌లో కలుపనున్నట్లు సమాచారం. మహబూబాబాద్‌ జిల్లాలోకి ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాలు కలుస్తున్నాయి. ఈ క్రమంలో పాలనాపరంగా మçహబూబాబాద్‌ జిల్లాలోని డిపోలకు ఖమ్మం రీజియన్‌లో ఉండడం సౌలభ్యంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తొర్రూరు డిపోకు వరంగల్‌ రీజియన్‌ అనుకూలంగా ఉన్న జిల్లా పరంగా ఒక డిపో ఖమ్మం రీజియన్‌లో, ఒక డిపో వరంగల్‌ రీజియన్‌లో ఉంటే ఇబ్బందులు తలెత్తనున్నాయని భావిస్తున్న అధికారులు మహబూబాద్‌ జిల్లాను ఆర్టీసీ పరంగా ఖమ్మం రీజియన్‌లో ఉంచాలనే ఆలోచనలో ఆర్టీసీ యాజమాన్యం ఉన్నట్లు సమాచారం. అయితే సిబ్బంది అంశంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఉద్యోగులు, కార్మికుల నియామకం రీజియన్‌ల వారీగా చేపట్టడంతో సీనియారిటీపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉంది. ఉద్యోగులకు, కార్మికులకు ఆప్షన్‌ అవకాశం ఇవ్వాలా? నియామకం పొందిన జిల్లాలోనే కొనసాగించాలా? ఆనే ఆలోచనలో యాజమాన్యం ఉంది.
మరిన్ని వార్తలు