నంద్యాల నుంచే నూతన శకం

14 Jun, 2017 22:48 IST|Sakshi
నంద్యాల నుంచే నూతన శకం
మొదట పార్టీ మారిన ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచే అధికార పార్టీకి షాక్‌
– మునిసిపాలిటీపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా
– చైర్‌పర్సన్‌ సహా 24 మంది కౌన్సిలర్లు పార్టీలో చేరిక
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎక్కడి నుంచి ఎమ్మెల్యేల కొనుగోలు ప్రారంభమయ్యిందో అక్కడి నుంచే అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగలడం మొదలయింది. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని పార్టీలో చేర్చుకోవడం ద్వారానే గోడదూకుడు వ్యవహారానికి టీడీపీ శ్రీకారం చుట్టింది. అయితే, అదే నియోజకవర్గం నుంచే ఇప్పుడు అధికార పార్టీపై తిరుగుబాటు ప్రారంభమయ్యింది.
 
ఇంకా రెండేళ్లపాటు అధికారం చేతిలో ఉండికూడా.. కేవలం నమ్మిన సిద్ధాంతాల కోసం, నమ్మకమైన లీడర్‌ కోసం ప్రతిపక్ష పార్టీలో చేరారు మాజీ మంత్రి శిల్పా మోహన్‌ రెడ్డి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో శిల్పా చేరికతో.. నంద్యాల నియోజకవర్గంలో ఉప ఎన్నికలకు ముందు అధికార పార్టీకి కోలుకోలేని షాక్‌ తగిలింది. నంద్యాల నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి శిల్పా మోహన్‌ రెడ్డి బుధవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయనతో పాటు అనేక మంది ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు జగన్‌ సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. దీంతో అధికార పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.
 
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ జెండా...!
నంద్యాల మునిసిపాలిటీలో మొత్తం 42 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇందులో చైర్‌పర్సన్‌ దేశం సులోచనతో పాటు 24 మంది కౌన్సిలర్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వీరంతా వైఎస్‌ఆర్‌సీపీ కండువాలు స్వీకరించారు. దీంతో మునిసిపాలిటీపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగిరింది. ఇక నియోజకవర్గంలో ఉన్న ఇద్దరు జెడ్పీటీసీల్లో ఒకరు వైఎస్‌ఆర్‌సీపీ జెండా కప్పుకున్నారు. 
 
16 మంది ఎంపీటీసీలూ చేరిక
శిల్పా మోహన్‌రెడ్డితో పాటు 16 మంది సర్పంచ్‌లు కూడా వైఎస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఫలితంగా నంద్యాల నియోజకవర్గంలో త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగరడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు ముందుగా మునిసిపాలిటీ నుంచే అడుగులు పడ్డాయి. మొత్తం మీద నంద్యాల నియోజకవర్గంలో నూతన ఉత్తేజం ప్రారంభమైంది. 
 
మరిన్ని వార్తలు