గీత దాటితే వేటే

27 Jun, 2017 09:27 IST|Sakshi
గీత దాటితే వేటే

► పోలీసులు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి
► అవినీతి ఆరోపణలు వస్తే సహించేది లేదు
► నేరం చేసిన ప్రతి ఒక్కరికీ శిక్ష పడేలా చర్యలు
► ‘ప్రజాదర్బార్‌’ వంటి మంచి కార్యక్రమాలు కొనసాగిస్తాం
► ప్రతి విభాగానికి సీనియర్‌ అధికారుల పర్యవేక్షణ  
► జిల్లాలోని సమస్యలపై ప్రత్యేక దృష్టి
► బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్పీ గోపినాథ్‌ జట్టి


కర్నూలు: ‘ప్రజల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటాం. సాంకేతికతను వినియోగించుకుంటూ మెరుగైన సేవలందిస్తాం. అధికారులందరూ వారి పరిధి మేరకు విధులు నిర్వర్తించాలి. కేసుల దర్యాప్తు వేగవంతంగా, పారదర్శకంగా చేపట్టాలి. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేద’ని జిల్లా నూతన ‘పోలీస్‌ బాస్‌’ గోపినాథ్‌ జట్టి హెచ్చరించారు. ఆయన సోమవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నుంచి రోడ్డుమార్గం గుండా కర్నూలు బీ.క్యాంపులోని పోలీసు అతిథిగృహానికి చేరుకున్నారు. 12.33 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకుని ఆకె రవికృష్ణ నుంచి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.

అనంతరం మినీ కాన్ఫరెన్స్‌ హాలులో అదనపు ఎస్పీ షేక్షావలితో కలిసి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయనే విషయంపై పత్రికల్లో వచ్చిన కథనాలను చదివానని, అందుకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించుకుంటూ బేసిక్‌ పోలీసింగ్‌ను ప్రజల వద్దకు తీసుకెళ్తామన్నారు. అధికారులందరూ టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు శాఖలోని వివిధ విభాగాలను సమన్వయపరుస్తూ, ఇతర శాఖల సహకారం కూడా తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు.

ప్రతి విభాగానికీ సీనియర్‌ అధికారుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. తద్వారా పోలీసు వ్యవస్థపై ప్రజల్లో గౌరవాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజాదర్బార్‌ వంటి మంచి కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు.  ఎలాంటి సమస్యలున్నా ప్రజలు పోలీసులను సంప్రదించి పరిష్కరించుకోవాలన్నారు. అన్యాయం, మోసానికి గురై స్టేషన్లకు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడికి న్యాయం చేయాలన్న స్పృహను పెంపొందించుకోవాలని సిబ్బందికి సూచించారు. ఎవరికైనా స్టేషన్లలో న్యాయం జరగలేదనుకుంటే నేరుగా తనను కలవవచ్చని సూచించారు. జిల్లాలోని, పోలీస్‌ కుటుంబాల్లోని ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. తనను కలవడానికి వచ్చిన వివిధ హోదాల్లోని అధికారులతో మాట్లాడారు. పోలీసు సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం డీఐజీ రమణకుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.   

ఎస్పీ జీవన ప్రస్థానం...
పేరు – గోపినాథ్‌ జట్టి (ఐపీఎస్‌)
తండ్రి – పుల్లయ్య (రైతు కుటుంబం)
తల్లి – వెంకమ్మ
స్వగ్రామం – నెల్లూరు జిల్లా
ఓజిలి మండలం కరబల్లివోలు
పుట్టిన తేదీ    – 01–01–1980
భార్య – వై.సుష్మ (బీటెక్‌)
కుమార్తెలు    – జానవి, రిత్వి
చదువు – వ్యవసాయ విద్యలో పీజీ, స్వగ్రామంలో 7వ తరగతి వరకు, 8 నుంచి ఇంటర్‌ వరకు నాయుడుపేటలోని సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూలు, డిగ్రీ ఎస్వీ ఆర్ట్స్‌ కాలేజీ (తిరుపతి).
ఐపీఎస్‌ బ్యాచ్‌ – 2008
(జాతీయ స్థాయిలో 144వ ర్యాంకు)

మరిన్ని వార్తలు