పల్లెల్లో అంతర్జాతీయ వైద్యం

22 Dec, 2015 15:18 IST|Sakshi
పల్లెల్లో అంతర్జాతీయ వైద్యం

ప్రయోగాత్మకంగా అనంతపురంలో అమలు
సీఎంను కలిసిన న్యూ మెక్సికో వర్సిటీ బృందం


హైదరాబాద్, డిసెంబర్ 22:  ప్రపంచవ్యాప్తంగా వైద్యచికిత్సల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా అందించడానికి ఒక అంతర్జాతీయ బృందం ముందుకొచ్చింది. దీన్ని ప్రయోగాత్మకంగా అనంతపురం జిల్లాలో అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఈ బృందానికి సూచించారు. మంగళవారం మధ్యాహ్నం అసెంబ్లీలోని తన కార్యాలయంలో కలిసిన న్యూ మెక్సికో యూనివర్సిటీ వైద్య నిపుణుల బృందంతో సీఎం మాట్లాడారు. ఎకో ఇండియా, కరుణ ట్రస్టు ప్రతినిధులతో కలిసి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తామని ఈ బృందం ముఖ్యమంత్రికి తెలిపింది.

గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీలకు జవసత్వాలు కల్పిస్తున్నట్టు సీఎం ఈ సందర్భంగా చెప్పారు. పేదల వైద్యానికి నిధుల కొరత లేదని, అన్ని ప్రభుత్వాసుపత్రులలో ఆధునిక వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు, సామాజిక బాధ్యత కింద కార్పొరేట్ సంస్థలు ముందుకొచ్చి పల్లెల్లో పనిచేయాలనుకోవడం మంచి పరిణామమని అభినందించారు. మాతా, శిశు మరణాలను నూరు శాతం తగ్గించటానికి అంతర్జాతీయ వైద్య నిపుణులు మన రాష్ట్రంలోని 12,000 మంది నర్సులకు దశలవారీగా శిక్షణ ఇస్తారు. న్యూ మెక్సికో యూనివర్సిటీ, ఎకో, కరుణ ట్రస్టు సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వంతో అవగాహనకు వచ్చాయి.

అనంతపురం జిల్లాలో ప్రయోగాత్మకంగా ముందు కంటి శస్త్ర చికిత్సలు, దంత వైద్యం, మానసిక వైద్యం, ప్రాథమిక ఆరోగ్య విభాగాల్లో సేవలు అందుబాటులోకి వస్తాయి. అంతర్జాతీయ నిపుణులు స్థానిక వైద్యులకు, నర్సులకు శిక్షణనిస్తారు. శస్త్ర చికిత్సల్లో టెలిమెడిసిన్ విధానం ఉపయోగించుకుంటారు.
అనంతపురం జిల్లాలో పైలట్ ప్రాజెక్టును అమలుచేశాక మిగిలిన 12 జిల్లాలకు విస్తరింపజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పటికే కర్ణాటకలోని 28 పీహెచ్‌సీలలో స్పెషలిస్టు హెల్త్ కేర్ అందజేస్తున్న కరుణ ట్రస్టు సేవలను ముఖ్యమంత్రి ప్రశంసించారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు.


సీఎంను కలిసిన  ప్రతినిధి బృందంలో ఎకో ప్రాజెక్టు డైరెక్టర్, గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు డాక్టర్  సంజీవ్ అరోరా, పెర్మియన్ ప్రీమియర్ హెల్త్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు డాక్టర్ జయరామ్ నాయుడు, ఎకో అమెరికా ప్రోగ్రాం స్పెషలిస్టు స్మిత్, ఎకో చైర్మన్ డాక్టర్ కుముద్ మోహన్ రాయ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ ఆనంద్, కరుణ ట్రస్టు సంయుక్త కార్యదర్శి వెంకట నారాయణతో పాటు ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఉన్నారు.
 

మరిన్ని వార్తలు