ఎంఫార్మసీ కోర్సు నిర్వహణకు నూతన నిబంధనలు

28 Mar, 2016 20:20 IST|Sakshi

ఏఎన్‌యూ (విశాఖపట్నం) : ఎంఫార్మసీ కోర్సు నిర్వహణకు దేశవ్యాప్తంగా నూతన నిబంధనలు అమలులోకి తెస్తున్నామని పీసీఐ (ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) పాలకమండలి సభ్యుడు డాక్టర్ ఎండీ కార్వేకర్ తెలిపారు. ఏఎన్‌యూ ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయస్థాయి వర్క్‌షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం ఐపీసీఏ కార్యదర్శి, ఐపీఏ ఎడ్యుకేషన్ డివిజన్ చైర్మన్ ఆచార్య టీవీ నారాయణతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటివరకు ఎంఫార్మసీ కోర్సుల నిర్వహణకు సంబంధించిన వసతులు, సీట్లకు అనుమతి, అధ్యాపకుల ప్రమాణాల్లో కొన్ని లోపాలు ఉన్నాయని పీసీఐ గుర్తించిందన్నారు. పీసీఐ నిపుణులు రూపొందించిన ఈ నూతన నిబంధనలు వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వం అమలులోకి తీసుకురానుందని ఆయన పేర్కొన్నారు.

ఎంఫార్మసీలో ఒక్కో బ్రాంచ్‌లో 15 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉంటుందని, తప్పకుండా ఐదుగురు అధ్యాపకులు ఉండాలనే నిబంధన అమలులోకి రానుందన్నారు. దీనివల్ల ఫార్మసీ విద్యపై ప్రస్తుతం నెలకొన్న అభద్రతాభావం తొలగిపోతుందని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని పీసీఐ నూతన నిబంధనలు రూపొందించిందని అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,500 ఫార్మసీ విద్యాసంస్థలు ఉండగా వాటిలో 15 శాతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనే ఉన్నాయన్నారు. బీఫార్మసీ ప్రాక్టీస్ అనే బ్రిడ్జి కోర్సును కూడా ప్రవేశపెట్టేందుకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) చర్యలు తీసుకుంటుందన్నారు. మన దేశం ఉత్పత్తి చేస్తున్న డ్రగ్స్ నాణ్యతపై చైనా వంటి దేశాలు ఆరోపణలు చేస్తున్నాయని దానిపై మన ప్రభుత్వం డబ్ల్యూహెచ్‌వో(వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్)కు ఫిర్యాదు చేసిందని తెలిపారు.

>
మరిన్ని వార్తలు