ఐటీడీఏ ప్రక్షాళనకు అధికారులు కసరత్తు !

20 Jun, 2016 10:32 IST|Sakshi

 లోపాలను సరిదిద్దేందుకు యత్నం
  విధులకు డుమ్మాకొట్టే వారికి బయోమెట్రిక్‌తో చెక్
  విద్య, వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి
  ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు !  


పార్వతీపురం: అవినీతి.. అవకతవకలు.. విధులకు డుమ్మా.. మితిమీరిన రాజకీయాలు... వంటి వాటితో ఎక్కడ వేసిన గొంగళి... అక్కడే అన్న చందంగా ఉన్న ఐటీడీఏను ప్రక్షాళన చేసేందుకు పీవో వి.ప్రసన్నవెంకటేష్ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా తాను పనిచేస్తూ... అధికారులు, సిబ్బందితో పనిచేయించేందుకు కొత్త పీవో ప్రసన్న వెంకటేష్ సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాలపై ఆయన దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే ఐటీడీఏ కార్యాలయంతోపాటు పీహెచ్‌సీలు, వెలుగు, ఇంజినీరింగ్ తదితర శాఖల్లో విధులకు డుమ్మా కొడుతున్న అధికారులు, సిబ్బందిని దారిలోకి తెచ్చేందుకు బయోమెట్రిక్ హాజరుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. అవినీతి మరకలంటుకున్న వ్యవసాయ, ఉద్యానవన, ఉపాధి తదితర శాఖలను శుద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

అధికారుల పనితీరు తెలుసుకునేందుకు ‘గ్రామదర్శిని’
సబ్-ప్లాన్‌లోని పంచాయతీలు, గ్రామాలలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా ‘గ్రామదర్శిని’ అనే కార్యక్రమాన్ని అమలు చేయాలని పీవో నిర్ణయించినట్లు తెలిసింది. ముందుగా ఉపాధి, వ్యవసాయం, ఉద్యానవన, వెలుగు, వాటర్ షెడ్, విద్య, వైద్య శాఖల్లో ఖాళీలను గుర్తించి, వాటిని భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. తన వ్యక్తిగత సిబ్బందిని కూడా రెగ్యులర్ స్టాఫ్‌ను నియమించుకునేందుకు ప్రస్తుతం ఉన్న సిబ్బంది గురించి ఆరా తీస్తున్నారు. గిరిజనులు ప్రధానంగా ఎదుర్కొంటున్న విద్య, వైద్యం సమస్యలతోపాటు రోడ్లు, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలను కల్పించేం దుకు గ్రామ స్థాయిలో పర్యవేక్షణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం. అధికారులు చెప్పే మాటలకే పరిమితం కాకుండా, పీవో క్షేత్రస్థాయి పరిశీలనకు శ్రీకారం చుట్టనున్నారు.

>
మరిన్ని వార్తలు