నూతన టెక్నాలజీతో వాహన రిజిస్ట్రేషన్లు

13 Oct, 2016 21:45 IST|Sakshi
నూతన టెక్నాలజీతో వాహన రిజిస్ట్రేషన్లు
విజయవాడ సిటీ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ–ప్రగతి కార్యక్రమంలో భాగంగా రవాణా శాఖ నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే కంప్యూటరీకరణలో ముందంజలో ఉన్న రవాణా శాఖ అధికారులు నూతన సాఫ్ట్‌వేర్‌ 1.2 వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దీని అమలులో భాగంగా లయోలా ఇంజినీరింగ్‌ కాలేజీలో నూతన సాఫ్ట్‌వేర్‌పై వాహన డీలర్లకు రెండు రోజుల పాటు నిర్వహించే శిక్షణ తరగతులను గురువారం ఉప రవాణా కమిషనర్‌ ఇ.మీరా ప్రసాద్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సాఫ్ట్‌వేర్‌లో ఆధార్‌ నంబర్‌ కీలక పాత్ర వహిస్తుందని తెలిపారు. ఇప్పుడున్న ఆన్‌లైన్‌ విధానంలో వాహన రిజిస్ట్రేషన్లకు సంబంధించి యజమాని వివరాలు నమోదు చేసేవారని చెప్పారు. ఇలాంటి సమయాల్లో కొన్ని తప్పులు దొర్లే అవకాశం ఉందన్నారు. నూతన విధానంలో ఆధార్‌ నంబరు నమోదు చేయగానే యజమానికి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడవుతాయని, ఇదే సమయంలో వాహన వెబ్‌సైట్‌లోకి వెల్లడం ద్వారా ఇంజిన్, చాసిస్‌ వంటివి తప్పులు లేకుండా ఆటోమేటిగ్గా నమోదు అవుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవోలు ఎం.పురేంద్ర, ఎస్‌.వెంకటేశ్వరరావు, డి.ఎస్‌.ఎన్‌.మూర్తి, ఎంవీఐలు వి.శ్రీనివాస్, మూర్తి, కాశీ, రాజుబాబు, వాహన డీలర్లు పాల్గొన్నారు. 
 
 
 
 
>
మరిన్ని వార్తలు