-

రౌడీయిజాన్ని అణచివేస్తా

27 Jun, 2017 13:36 IST|Sakshi
రౌడీయిజాన్ని అణచివేస్తా

► సమన్వయంతో పనిచేస్తా  
► కొత్త ఎస్పీ ఎం.రవి ప్రకాశ్‌ స్పష్టీకరణ


ఏలూరు అర్బన్‌: జిల్లాలో శాంతిభధ్రతల పరిరక్షణే తన తొలి ప్రాధాన్యమని ఎస్పీ ఎం.రవిప్రకాశ్‌ స్పష్టం చేశారు. సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా పరిస్థితులపై అవగాహన ఉందని, రౌడీయిజాన్ని సహించేది లేదని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.

మావోయిస్టులపై ప్రత్యేక దృష్టి
తెలంగాణ రాష్ట్రం నుంచి జిల్లాలో కలిసిన ఏడు మండలాలను కలిపి ఏర్పాటు చేసిన పోలవరం సబ్‌ డివిజన్‌పై ప్రత్యేక దృష్టి పెడతామని పేర్కొన్నారు. మావోయిస్టులను నియంత్రిస్తామని వివరించారు. విజిబుల్‌ పోలీసింగ్‌ పెంచి ప్రజలతో నిత్యం మమేకమవుతామని వెల్లడించారు.  

సముచిత గౌరవం కల్పిస్తాం
జిల్లాలో ప్రజాప్రతినిధులు, పోలీసుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు, బేదాభిప్రాయాలపై స్పందిస్తూ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజాసమస్యలను తమ దృష్టికి తీసుకుస్తే పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామనిపేర్కొన్నారు.  

నిత్యం అందుబాటులో..
డయల్‌ యువర్‌ ఎస్పీ అంటూ వారానికి ఒకసారి ప్రజలతో మాట్లాడేందుకు పరిమితం కాకుండా నిత్యం వారికి అందుబాటులో ఉండి పోలీసు వ్యవస్థపై నమ్మకం పెంచుతామన్నారు. సమస్యలు ఏమైనా పరిష్కారం కాకుంటే ప్రజలు ఫోన్‌లో లేదా కార్యాలయంలో తనతో నేరుగా సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. నేరస్తుల
కదలికలపై ప్రత్యేక దృష్టిపెడతామని వివరించారు.

ఎస్పీకి అభినందనలు  
ప్రస్తుత ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ నుంచి బాధ్యతలు స్వీకరించిన రవిప్రకాశ్‌ను ఆయన కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులు మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏలూరు  డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, ఎస్బీ డీఎస్పీ పి. భాస్కరరావు, ఏఆర్‌ డీఎస్పీ,  బి. చంద్రశేఖర్, ఏఆర్‌ ఓఎస్‌డీ, బి.రామకృష్ణ, ట్రాఫిక్‌ డీఎస్పీ, ఆవుల శ్రీనివాసరావు, ఏఆర్‌ ఆర్‌ఐ, కె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు