రోడ్డేశారు.. తవ్వేశారు..

7 Nov, 2016 00:54 IST|Sakshi
రోడ్డేశారు.. తవ్వేశారు..
  •  పైప్‌లైన్‌ నిర్మాణం కోసం ధ్వంసం చేస్తున్న వైనం
  •  శాఖల మధ్య సమన్వయ లోపంతో నిధులు నేలపాలు
  •  
    నెల్లూరు సిటీ: రెండు శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా రూ.లక్షలు నేలపాలవుతున్నాయి. ఆర్‌ అండ్‌ బీ, పబ్లిక్‌హెల్త్‌ శాఖల అధికారులు ఎవరి దారిలో వారు వెళ్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఫలితంగా కాంట్రాక్టర్‌కు నిధుల పంట పండుతోంది. నగరంలోని పోలీస్‌ గ్రౌండ్స్‌ నుంచి డైకస్‌రోడ్డు వరకు ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులకు ఆర్‌ అండ్‌ బీ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చిలో పోలీస్‌ గ్రౌండ్స్‌ నుంచి చెట్లు, దుకాణాలు, విద్యుత్‌ స్తంభాలను తొలగించారు. రోడ్డుకు ఇరువైపులా పదడుగుల మేర రోడ్డును విస్తరించాల్సి ఉంది. డైకస్‌రోడ్డు వరకు చేపటాల్సిన విస్తరణ పనులు ఎస్పీ బంగ్లా వరకు సాగాయి. 
    రోడ్డేసి నాలుగు నెలలు గడవకముందే
    రోడ్డు విస్తరణలో భాగంగా పోలీస్‌ గ్రౌండ్స్‌ వద్ద రెండు వైపులా రోడ్డు పనులు జరిగాయి. ఆర్‌ అండ్‌ బీ అధికారులు రూ.10 కోట్ల విలువైన పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించారు. రోడ్డును వేసిన నాలుగు నెలలకే పబ్లిక్‌ హెల్త్‌ శాఖ అధికారులు జేసీబీ సాయంతో పగలగొట్టారు. నగరంలో తాగునీటి పథకంలో భాగంగా పైప్‌లైన్‌ నిర్మాణం జరుగుతోంది. అయితే అప్పటికే కాంట్రాక్టర్‌ రోడ్డును నిర్మించడంతో పబ్లిక్‌ హెల్త్‌ అధికారులు వేసిన రోడ్డును తవ్వి పైప్‌లు వేస్తున్నారు. సమన్వయ లోపం కారణంగా నిధులు వృథా కావడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    రోడ్డు విస్తరణకు ఆటంకం
    పోలీస్‌ గ్రౌండ్స్‌ నుంచి డైకస్‌రోడ్డు వరకు విస్తరణ పనులు ఈ ఏడాది మార్చిలో ప్రారంభమయ్యాయి. నగరపాలక సంస్థ, అటవీ, విద్యుత్‌, ఆర్‌ అండ్‌ బీ శాఖల సమన్వయంతో విస్తరణ పనులను చేయాల్సి ఉంది. అయితే అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు విస్తరణ పనులు జరగనీయకుండా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ఎస్పీ బంగ్లా వరకు మాత్రమే రోడ్డు విస్తరణ జరిగింది. అధికార పార్టీకి చెందిన రూరల్‌ నియోజకవర్గంలోని ఓ ముఖ్యనేత, మేయర్‌ అజీజ్‌ రోడ్డు విస్తరణ పనులు జరగకుండా అడ్డుపడ్డారనే విమర్శలు ఉన్నాయి. దీంతో టౌన్‌ప్లానింగ్‌ అధికారులు దుకాణాలు కూల్చివేతను నిలిపేశారు. రోడ్డు విస్తరణ పనులు ఇక అటకెక్కినట్లేనని ప్రజలు పేర్కొంటున్నారు.
     
     
మరిన్ని వార్తలు