గ్యాస్ లీకై నవ వధువు సజీవదహనం

8 May, 2016 18:28 IST|Sakshi

క్రోసూరు (గుంటూరు జిల్లా) : వంట గ్యాస్ లీకై సంభవించిన అగ్నిప్రమాదంలో ఓ నవ వధువు సజీవ దహనమైన ఘటన గుంటూరు జిల్లా క్రోసూరులో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో మూడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. స్థానిక మార్కెట్ యార్డు వెనుకభాగంలో ఉన్న ఎస్టీ కాలనీలో ఈ ఘోరం చోటుచేసుకుంది. రేఖమణి వెంకటకృష్ణ, ఆదెమ్మ దంపతుల కుమార్తె లావణ్య (19)ను నరసరావుపేట ప్రాంతానికి చెందిన వనపర్తి మస్తాన్‌కు ఇచ్చి గత నెల 29న వివాహం చేశారు. అల్లుడిని కూడా తమ ఇంటి వద్దే ఉంచుకుని వ్యాపారం చేయించాలనే యోచనలో వెంకటకృష్ణ దంపతులు ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం నవదంపతులు ఇక్కడి వచ్చారు. ఆదివారం ఉదయం లావణ్య దంపతులు పాలప్యాకెట్ కోసం బజారుకెళ్లారు.

ముందుగా లావణ్య ఇంటికి వచ్చి టీ పెట్టేందుకు వరండాలోని గ్యాస్ స్టవ్ వెలిగించింది. అప్పటికే వంటగ్యాస్ లీకై ఉండడంతో ఒక్కసారిగా మంటలు అంటుకుని చుట్టుముట్టాయి. దీంతో భయాందోళన చెందిన ఆమె ఇంట్లోకి వెళ్లింది. క్షణాల్లో మంటలు పెద్దవి కావడంతో ఆ మంటల్లో చిక్కుకుని లావణ్య సజీవ దహనమైంది. ప్రమాదంలో పక్కనే ఉన్న మూడు పూరిళ్లు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. వ్యాపారనిమిత్తం పక్క గ్రామం వెళ్లిన లావణ్య తల్లిదండ్రులు, సోదరుడు ఇంటికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనాస్థలానికి సత్తెనపల్లి సీఐ కోటేశ్వరరావు, అచ్చంపేట ఎస్‌ఐ రాజేశ్వరరావు చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తహశీల్దార్ జేఏ ప్రసూన బాధిత కుటుంబాలకు 20 కిలోల బియ్యం, ఐదు లీటర్ల కిరోసిన్, ఐదు వేలు ఆర్థిక సహాయం అందజేశారు.

>
మరిన్ని వార్తలు