నిండుకుంటున్న చీప్ లిక్కర్!

20 Oct, 2015 03:50 IST|Sakshi
నిండుకుంటున్న చీప్ లిక్కర్!

♦ గుడుంబాపై దాడులతో పెరిగిన చీప్ లిక్కర్ అమ్మకాలు
♦ ఐదు డిస్టిలరీల నుంచి నెలకు 3 లక్షల పెట్టెలు తయారీ
♦ ఈ నెలలో ఇప్పటికే 1.82 లక్షల పెట్టెల వినియోగం
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నుంచి గుడుంబా మహమ్మారిని తరిమికొట్టాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయ ప్రభావం చీప్‌లిక్కర్‌పై పడింది. రాష్ట్రవ్యాప్తంగా గుడుంబా విక్రయాలు తగ్గడంతో చీప్‌లిక్కర్ విక్రయాలు భారీగా పెరిగి చివరికి ‘చీప్’కు కొరత వచ్చే పరిస్థితి. ప్రస్తుతం డిస్టిలరీల్లో ఉన్న చీప్ లిక్కర్.. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేసేందుకు సరిపోదని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. దసరా పండుగకు నిల్వ ఉన్న చీప్‌లిక్కర్‌తో ఎలాగోలా కానిచ్చినా... ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే నెల నుంచి డిమాండ్, సరఫరాల్లో తేడా రావచ్చని టీఎస్‌బీసీఎల్ అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో చీప్‌లిక్కర్ ఉత్పత్తిని పెంచేలా డిస్టిలరీలపై ఒత్తిడి తేవాలని భావించారు. ఉత్పత్తి సామర్థ్యం సరిపోకపోతే ఇతర రాష్ట్రాల నుంచి చీప్‌లిక్కర్‌ను దిగుమతి చేసుకునే ఆలోచనతో ఎక్సైజ్ శాఖ ఉంది.

 గుడుంబాకు ఆ నాలుగు జిల్లాలే కీలకం
 రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో గుడుంబా తయారీ, విక్రయాలు కుటీర పరిశ్రమను మించిపోయాయి. మహబూబ్‌నగర్, నల్లగొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని గ్రామాల్లో కోట్ల రూపాయల టర్నోవర్‌తో నెలనెలా లక్షలాది లీటర్ల గుడుంబా వినియోగం జరిగేది. దీంతో ఈ జిల్లాల్లో చీప్‌లిక్కర్‌కు డిమాండ్ తక్కువగా ఉండేది. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ సెప్టెంబర్ 1 నుంచి గుడుంబాపై ఉక్కుపాదం మోపారు. దీంతో గుడుంబా తయారీ, విక్రయాలు తగ్గి ఈ నాలుగు జిల్లాల్లో చీప్ లిక్కర్ విక్రయాలు భారీగా పెరిగాయి. ఇక అక్టోబర్‌లో 15వ తేదీ వరకే చీప్‌లిక్కర్ నెలవారీ అమ్మకాలను మించిపోయాయి.

ఈనెల 18 వరకు రాష్ట్రంలో 1.82 లక్షల పెట్టెలు (ఒక పెట్టెలో 180 ఎంఎల్ బాటిళ్లు 48 ఉంటాయి) చీప్‌లిక్కర్ అమ్ముడైనట్లు టీఎస్‌బీసీఎల్ రికార్డులు చెబుతున్నాయి. గత సంవత్సరం ఇదే సమయంలో కేవలం 68 వేల పెట్టెలు మాత్రమే విక్రయించడం గమనార్హం. ఈనెలాఖరుకల్లా చీప్‌లిక్కర్ అమ్మకాలు 4 లక్షల పెట్టెలకు చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

 3 లక్షల పెట్టెల వరకే ఉత్పత్తి
 రాష్ట్రంలో దేశీయ మద్యం తయారీ (ఐఎంఎల్) డిస్టిలరీలు 17 ఉండగా, వీటిలో బగ్గా, ఆర్‌కే, రిసోమ్, లిక్కర్ ఇండియా డిస్టిలరీస్, కమల్ వైనరీలల్లో మాత్రమే చీప్‌లిక్కర్ ఉత్పత్తి అవుతుంది. ఈ ఐదు డిస్టిలరీల్లో చీప్ లిక్కర్ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 3 లక్షల పెట్టెలు అంటే సుమారు 26 లక్షల లీటర్లు మాత్రమే. గుడుంబాను హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాలు, తాండాలు తదితర ప్రాంతాల్లోని 10 వేల పాయింట్లలో విక్రయిస్తుండగా, దాడులతో ఈ సంఖ్య 3 వేలకు తగ్గిందని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగం చెబుతోంది. ఈ నేపథ్యంలోనే చీప్‌లిక్కర్ విక్రయాలు అనూహ్యంగా పెరిగాయి. గుడుంబా విక్రయాలు పూర్తిగా నిలిచిపోతే మీడియం, ప్రీమియం లిక్కర్ తయారు చేసే డిస్టిలరీలు కూడా చీప్‌లిక్కర్ వైపు వెళ్తాయేమో!

మరిన్ని వార్తలు