ఏడాదిలోపు భగీరథ నీళ్లు

6 Apr, 2016 04:35 IST|Sakshi

ఏడు నియోజక వర్గాల్లో
14.86 లక్షల జనాభాకు తాగునీరు
ఏటా 3.71 టీఎంసీల సరఫరా
భూముల అప్పగింతకు కలెక్టర్‌కు ప్రతిపాదనలు
మిషన్ భగీరథ ఈఈ ఆంజనేయులు

తాండూరు: జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలోని 14,86,986 మంది జనాభాకు వచ్చే ఏడాది నాటికి తాగునీరు అందించనున్నట్టు మిషన్ భగీరథ పథకం జిల్లా ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ ఆంజనేయులు తెలిపారు. మంగళవారం తాండూరుకు విచ్చేసిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల, పరిగి, వికారాబాద్ నియోజకవర్గాల పరిధిలోని 27మండలాలు, రెండు మున్సిపాలిటీ (తాండూరు, వికారాబాద్)లతోపాటు ఇబ్రహీంపట్నం నగర పంచాయతీలు, మరో 1,389 అనుబంధ గ్రామాలు, తండాల్లో మిషన్ భగీరథ కింద జిల్లాకు తాగునీరు అందించడమే లక్ష్యమని తె లిపారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా ప్రతి ఏడాది జిల్లాకు సుమారు 3.71 టీఎంసీల తాగునీరు అందిస్తామని వివరించారు.

ఆయా నియోజకవర్గాలు, మున్సిపాలిటీలు, అనుబంధ గ్రామాల్లో పైప్‌లైన్ పనులకు సంబంధించి డిజైన్లు పూర్తయ్యాయని చెప్పారు. పైప్‌లైన్ పనులు చేపట్టేందుకు రెవెన్యూ శాఖ నుంచి భూముల అప్పగింత ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదన్నారు. దీనిపై కలెక్టర్‌కు ప్రతిపాదనలు చేశామన్నారు. పైప్‌లైన్ పనులతో సాగులో ఉన్న పంటలకు నష్టం కలిగితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెవెన్యూ శాఖ పరిహారం చెల్లించే అవకాశం ఉందని ఆయన అన్నారు. త్వరలోనే మిషన్ భగీరథ పనులు మొదలు కానున్నాయని ఆయన చెప్పారు. ఆయన వెంట డీఈ నాగేశ్వర్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు