అవార్డు ఫంక్షన్‌ లేనట్టేనా?

28 Sep, 2016 01:51 IST|Sakshi
అవార్డు ఫంక్షన్‌ లేనట్టేనా?
  • నిర్వహించేలా లేరని చర్చించుకుంటున్న షార్‌ అధికారులు
  •  
    శ్రీహరికోట(సూళ్లూరుపేట): సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)లో ప్రతి ఏటా అక్టోబర్‌ 4 నుంచి 10 వరకు నిర్వహించే ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో ఈ ఏడాది జీఎస్‌ఎల్‌వీ అవార్డు పంక్షన్‌ నిర్వహించడం లేదని విశ్వసనీయంగా తెలుస్తోంది. సాధారణంగా 4న సూళ్లూరుపేట పట్టణంలో స్పేస్‌వాక్‌ కార్యక్రమం, షార్‌లోని అన్ని విభాగాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుపుకుంటారు. అదే విధంగా అక్టోబర్‌ 8, 9 తేదీల్లో జీఎస్‌ఎల్‌వీ అవార్డు పంక్షన్‌ నిర్వహించేవారు. తెలుగు రాష్ట్రాల్లో స్టేట్‌ సిలబస్, సెంట్రల్‌ సిలబస్‌లో 2015–16 విద్యాసంవత్సరం పదో తరగతి జిల్లాస్థాయి ఉత్తీర్ణతలో టాప్‌ ర్యాంకర్లుగా నిలిచిన వారిని జిల్లాకు ఇద్దరు చొప్పున షార్‌కు రప్పించేవారు. మెరిట్‌ విద్యార్థులతోపాటు తల్లిదండ్రులను ఆహ్వానించి రెండురోజులపాటు ఆతిథ్యం ఇచ్చి షార్‌ కేంద్రాన్ని చూపించేవారు. రెండో రోజున అంతరిక్ష విజ్ఞానంపై పోటీ పరీక్షలు నిర్వహించి అందులో ప్రథమస్థానంలో నిలిచిన వారికి జీఎస్‌ఎల్‌వీ అవార్డును బహూకరించేవారు. అయితే ఈ ఏడాది కూడా విద్యార్థుల జాబితాలను సేకరించారు కానీ ఎవరికీ సమాచారం పంపించలేదు. సాధారణంగా ఈ పాటికి అందరికీ ఆహ్వానాలు పంపించి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి రైళ్లకు, బస్సులకు రిజర్వేషన్లు చేయించుకోమని ఆదేశాలిచ్చేవారు. ఈ ఏడాది ఇప్పటిదాకా ఆ ఊసే లేకపోవడంతో ఈ సారి జీఎస్‌ఎల్‌వీ అవార్డు పంక్షన్‌ నిర్వహించేలా లేరని షార్‌ అధికారులే ఒకరితో ఒకరు చర్చించుకుంటున్నారు. 
    విముఖత ఎందుకో?
    ఈ సారి అంతరిక్ష వారోత్సవాలను మూడు రాష్ట్రాల్లోని సుమారు 17 ప్రాంతాలకు విస్తరించారే గాని ఆనవాయితీగా నిర్వహిస్తున్న జీఎస్‌ఎల్‌వీ అవార్డు పంక్షన్‌ను మాత్రం నిర్వహించేందుకు సుముఖంగా కనిపించడం లేదు. షార్‌ నుంచి చేస్తున్న ప్రతి ప్రయోగం విజయవంతం చేస్తున్నప్పటికీ ఆ ఫలితాలను ప్రజలతో పంచుకోవాలంటే ఇలాంటి కార్యక్రమాలు అవసరమే అయినప్పటికి నిర్వహించేందుకు మాత్రం షార్‌ యాజమాన్యం ఎందుకు చొరవచూపడం లేదో అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. 
     
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు