బ్లాక్‌బస్టర్ నాకొద్దు.. సందేశమే ముద్దు..

26 Oct, 2015 20:05 IST|Sakshi
షూటింగ్‌లో బాలనటికి సూచనలిస్తున్న శాస్త్రి

 - ప్రముఖ దర్శకుడు కేఎన్‌టీ శాస్త్రి 
అమలాపురం రూరల్ : పెద్ద హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమా తీయడం కంటే సందేశాత్మక చిత్రం తీయడానికే మొగ్గు చూపుతానని ఐదు జాతీయ అవార్డుల గ్రహీత, ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత కేఎన్‌టీ శాస్త్రి అన్నారు. బాలల కథాంశంతో ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న ‘శాణు’ చిత్రం షూటింగ్ కోనసీమలో జరుగుతోంది. ఈ సందర్భంగా ఆదివారం ఆయన కొంతసేపు ‘సాక్షి’తో ముచ్చటించారు.
 
 సాక్షి : సినీ రంగంలో మీ ప్రస్థానం?
 శాస్త్రి : సినీ విమర్శకుడిగా సినీరంగంపై పుస్తకాలు రాశాను. మొదటిసారి ఉత్తమ సినీ విమర్శకుడిగానే జాతీయస్థాయిలో అవార్డు అందుకున్నాను. ఆ తరువాత ఉత్తమ సినీ పుస్తకాన్ని రచించినందుకు రెండు జాతీయ అవార్డులు, ఉత్తమ సందేశాత్మక చిత్రానికి ఒకసారి అవార్డులందుకున్నాను. సురభి నాటకం డాక్యుమెంటరీకి నేషనల్ అవార్డు వచ్చింది. తిలాదానం చిత్రంతో దర్శకునిగా మారాను. మొత్తం ఐదుసార్లు జాతీయ అవార్డులు అందుకున్నాను.
 
 సాక్షి : అంతర్జాతీయస్థాయిలో కూడా మీ చిత్రం పేరుపొందింది కదా ?
 శాస్త్రి : బాలివుడ్ నటి నందితాదాస్ హీరోయిన్‌గా తీసిన ‘కమిలి’ దక్షిణ కొరియాలో బూసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌తోపాటు పది దేశాల్లో ప్రదర్శితమైంది. కర్నాటక ప్రభుత్వం నుంచి బెస్ట్ అవార్డు అందుకుంది. నందితా దాస్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకుంది. ‘తిలాదానం’ చిత్రానికి నంది అవార్డు కూడా అందుకున్నాను.
 
 సాక్షి : జాతీయ, అంతర్జాతీయస్థాయిలలో పేరొందిన మీరు పెద్ద హీరోలతో సినిమాలు ఎందుకు చేయలేదు?
 శాస్త్రి :  పెద్ద నటులతో, భారీ బడ్జెట్ చిత్రాల జోలికి వెళ్లడం ఇష్టంలేదు. చిన్న బడ్జెట్‌లో సందేశాత్మక చిత్రం తీయడానికే ప్రాధాన్యతనిస్తాను. ఇప్పటి వరకు పది సినిమాలు తీయగా అన్నీ సందేశాత్మక చిత్రాలే .
 
 సాక్షి : ప్రస్తుతం తీస్తున్న సినిమా గురించి ?
 శాస్త్రి : చిల్ట్రన్ ఫిలిం సొసైటీ బాలల కథాంశంతో ఓ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యతను నాకు అప్పగించింది. పిల్లల్లో నమ్మకం అనే కథాంశంతో ‘శాణు’ చిత్రాన్ని తీస్తున్నాం. హీరో శివాజీ రాజా, హీరోయిన్ మాధవి తల్లిదండ్రులుగా, జాహ్నవి, మాస్టర్ సాత్విక్ పిల్లలుగా నటిస్తున్నారు.
 
 సాక్షి : చిత్రీకరణకు కోనసీమనే ఎంచుకున్నారు.?
 శాస్త్రి : గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు ఆడే ఆటలు, పిల్లల్లో నమ్మకం అనే అంశంపై తీస్తున్న చిత్రమిది. ముఖ్యంగా ఖోఖో వంటి ఆటలు పిల్లలు ఆడడమే మానేశారు. కోనసీమ అందాలతో సందేశాన్ని కూడా అందంగా చూపించాలని ఈ ప్రాంతంలో తీస్తున్నాం.

>
మరిన్ని వార్తలు