వాణిజ్యంపై నోట్ల రద్దు ప్రభావం

9 Nov, 2016 23:59 IST|Sakshi
వాణిజ్యంపై నోట్ల రద్దు ప్రభావం

విజయవాడ (వన్‌టౌన్‌) : పెద్దనోట్ల రద్దు ప్రభావంతో పాతబస్తీ బోసిపోయింది. రాష్ట్రంలోనే ప్రధాన వ్యాపార కేంద్రంగా భాసిల్లుతున్న వన్‌టౌన్‌ మార్కెట్లు అనధికారికంగా బంద్‌ ప్రకటించినట్లయింది. వందలాది కోట్ల వ్యాపారం జరిగే పాతబస్తీలో  ఐదు నుంచి పది శాతం మాత్రమే వ్యాపారం జరిగిందని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. పాతబస్తీలోని వస్త్రలత, కృష్ణవేణి షాపింగ్‌ కాంప్లెక్స్, పాతమార్కెట్, ప్రకాష్‌ మార్కెట్‌ తదితర ప్రాంతాల్లోని సుమారు వెయ్యి వస్త్ర దుకాణాల్లో వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగాయి. అలాగే హోల్‌సేల్‌ మెడికల్, పేపర్, ఫ్యాన్సీ, ఎలక్ట్రికల్, పచారీ, బంగారం, హార్డ్‌వేర్, ప్లాస్టిక్‌ తదితర సుమారు వందకు పైగా ఉన్న హోల్‌సేల్‌ సంఘాలకు చెందిన దుకాణాలన్నింటిలోనూ వ్యాపారం దాదాపుగా నిలిచిపోయిందనే చెప్పాలి.అర్ధరాత్రి నుంచి నిలిచిపోయిన బ్యాంకింగ్‌ బుధవారం నుంచి బ్యాంకులు మూతపడ్డాయి. అయితే మంగళవారం అర్ధరాత్రి నుంచి ఏటీఎంలు డిపాజిట్‌ యంత్రాలు కూడా పని చేయలేదు. ఎస్‌బీఐ ఏటీఎంలు మాత్రమే అర్ధరాత్రి పన్నెండు గంటల వరకూ పని చేశాయి.  
నిర్మానుష్యంగా పాతబస్తీ వీధులు
నిత్యం వినియోగదారులతో కళకళలాడే పాతబస్తీ మార్కెట్లు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి.  వ్యాపారాలు లేకపోవడంతో అందరూ ఒక చోట చేరి ఈ నోట్ల చెలమణి గురించే ప్రస్తావించుకోవడం కనిపించింది.
మూతపడిన ప్రధాన తపాలశాఖ
వన్‌టౌన్‌లోని హెడ్‌ పోస్టాఫీస్‌ ప్రభుత్వ ఆదేశాలతో బుధవారం మూతపడింది. బుధవారం పోస్టాఫీస్‌ తెరచుకోకపోవడంతో పోస్టల్‌ వినియోగదారులు అవస్థలు పడ్డారు. ప్రధానంగా ఇతర స్టాంపులు, ఇతర పోస్టల్‌ స్టేషనరీ విక్రయాలు లేకపోవడంతో వినియోగదారులు బయట దుకాణాల్లో అధిక మొత్తాన్ని చెల్లించి కొనుగోలు చేశారు.
 

మరిన్ని వార్తలు