బాబూరావుకు పెద్దల అండ?

11 Aug, 2015 09:40 IST|Sakshi
బాబూరావుకు పెద్దల అండ?

సాక్షి, గుంటూరు: ఏఎన్‌యూ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి కేసులో మొదటి నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ బాబూరావును పైస్థాయిలో కొందరు కాపాడుతున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. తమ కుమార్తెను సీనియర్ విద్యార్థులు వేధిస్తున్నారని ఫిర్యాదు చేసినా ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ నిజనిర్ధారణ కమిటీ ముందు చెప్పడం తెలిసిందే. మరోవైపు యాంటీ ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేసి విచారణ జరపాలంటూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రాజశేఖర్ ఈనెల ఆరోతేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీ సులు ఆయనపై కేసు నమోదు చేయలేదు. రిషితేశ్వరి కేసులో విచారణ చేపట్టిన కమిటీలు రెండూ ర్యాగింగ్ వ్యవహారంలో ప్రిన్సిపాల్ ప్రోత్సాహం ఉన్నట్లు స్పష్టం చేశాయి. ఫ్రెషర్స్ డే పార్టీని ఉద్దేశపూర్వకంగానే హాయ్‌ల్యాండ్‌లో ఏర్పాటు చేశారని, ఈ పార్టీలో మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు పాల్గొనాల్సి ఉండగా, ప్రిన్సిపాల్ నాలుగో సంవత్సరం విద్యార్థులైన జయచరణ్, శ్రీనివాస్‌లను సైతం తీసుకొచ్చారని కమిటీ తెలిపింది.

 

ఈ పార్టీలో విద్యార్థులందరికీ తన చేతుల మీదుగా బహుమతులు ఇచ్చిన ప్రిన్సిపాల్ రిషితేశ్వరికి మాత్రం చరణ్ చేతుల మీదుగా ఇప్పించినట్లు చెబుతున్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య తరువాత తనపై ఆరోపణలు రాగానే ప్రిన్సిపల్ హైదరాబాద్ వె ళ్లి సీఎం పేషీలో కొందరు అధికారుల ద్వారా పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు రిషితేశ్వరి మృతి కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ నిరాకరిస్తూ గుంటూరు ఒకటో అదనపు జిల్లా జడ్జి జి.గోపిచంద్ సోమవారం ఆదేశాలు జారీచేశారు. రిషితేశ్వరి కేసులో ఆమె తండ్రి మురళీకృష్ణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వీరి ముగ్గురు పేర్లు స్ప ష్టంగా ప్రస్తావించినట్టు ఆ ఆర్డర్‌లో తెలిపారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 27 మంది సాక్షులను విచారించారని తెలిపారు. ఈ కేసులో మొదటి ముద్దాయి దుంపా హనీషా, రెండో ముద్దాయి ధరావత్ జయచరణ్, మూడో ముద్దా యి నరాల శ్రీనివాస్‌ల పాత్ర ఉన్నట్లు కొంతమంది సాక్షులు తెలిపారని, వీరు ముగ్గురు ర్యాగింగ్ వంటి వికృత చర్యలకు పాల్పడ్డట్లు, ర్యాగింగ్ పేరుతో రిషితేశ్వరిపై మానసిక, శారీ రక, లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు పేర్కొన్నారని తెలిపారు. ర్యాగింగ్ కారణంగానే రిషితేశ్వరి మృతిచెందినట్లు పోలీసుల దర్యాప్తులో నిర్ధారించారని, అనీషా అనే విద్యార్థిని విషయంలో ఎటువంటి వివాదం లేదని, మరో అనీషా ఉందనే విషయంపై ఎటువంటి ఆధారాలు కోర్టు ఎదుట ప్రవేశపెట్టలేదని పేర్కొన్నారు. కేసు ద ర్యాప్తులో ఉందని, బెయిల్ మంజూరు చేయడం సరికాదంటూ పిటిషన్ తిరస్కరించారు.

మరిన్ని వార్తలు