‘నోటు’పాట్లు

17 Mar, 2017 01:22 IST|Sakshi
‘నోటు’పాట్లు

జిల్లాలో పనిచేయని ఏటీఎం సెంటర్లు
నగదు కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలు
మొత్తం 57 మిషన్లు.. పనిచేస్తున్నవి 14
పట్టించుకోని బ్యాంకు అధికారులు


వరంగల్‌ రూరల్‌: నల్లధనం వెలికితీత, నకిలీనోట్ల చెలామణిని అరికట్టేందుకు దేశ ప్రధాని నరేంద్రమోదీ పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసినప్పటి నుంచి ప్రజలు నగదు కోసం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. పాత పెద్ద నోట్లను డిసెంబర్‌లోగా తమ ఖాతాల్లో జమచేయాలని, తర్వాత నుంచి నిరంతరాయంగా సేవలందిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకో వడం లేదు. ఫలితంగా ప్రజలు నిత్యం ‘నోటు’ పాట్లు పడుతున్నారు. పునర్విభజన ప్రక్రియలో ఏర్పడిన వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 15 మండలాలు ఉన్నాయి. అయితే జిల్లా పరిధిలోని ఆయా మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ రం గాలకు చెందిన ఏటీఎం సెంటర్లు మొత్తం 57 ఉన్నాయి. కాగా, 24 గంటలపాటు వినియోగదారులకు సేవలందించాల్సిన సెంటర్లు నిర్వహణలోపంతో కునారిల్లుతున్నాయి. దీంతో అత్యవసర సేవలకు నగదు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పనిచేస్తున్నవి 14 మాత్రమే..
ఏటీఎం కార్డు ద్వారా ఎప్పుడు పడితే అప్పుడు నగదు తీసుకోవచ్చని ఆశపడుతూ సెంటర్ల వద్దకు పరుగులు తీస్తున్న వినియోగదారులకు నిరాశే ఎదురవుతోంది. ఖాతాదారులకు నిరంతరాయంగా సేవలందించాల్సిన బ్యాంకు అధికారులు తమకేం పట్టిందిలే అన్నట్లుగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని 57 ఏటీఎంల్లో సుమారు 15 రోజుల నుంచి 14 మాత్రమే పనిచేస్తున్నట్లు గురువారం ‘సాక్షి’ విజిట్‌లో వెలుగు చూసింది. కాగా, నర్సంపేట పట్టణంలో 6 ఏటీఎంలు ఉండగా 2 మాత్రమే సేవలందిస్తున్నాయి. పరకాల పట్టణంలో 6 ఏటీఎంలు ఉండగా ఒకటే పనిచేస్తోంది. అలాగే ఆత్మకూరు, శాయంపేట, గీసుకొండ, దామెర, సంగెం, నెక్కొండ, వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో ఒక్కో ఏటీఎం మాత్రమే పని చేస్తున్నాయి. ఇదిలా ఉండగా, దుగ్గొండి, నల్లబెల్లి, మండలాల్లో ఏటీఎంలు పనిచేయడం లేదు. చెన్నారావుపేటలోని ఒక ఏటీఎం గురువారం గంట మాత్రమే పనిచేసింది. అయితే 14 మిషన్లలో కూడా ఎప్పుడు డబ్బులు పెడుతారో.. ఎప్పుడు పనిచేస్తాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

అత్యవసర సేవలకు ఇబ్బందులు..
వ్యవసాయాధిరిత జిల్లాగా పేరొందిన వరంగల్‌ రూరల్‌లో ఖాతాదారులు, రైతులు నగదు కోసం ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్‌లో పంటల సాగుకు కావాల్సిన డబ్బుల కోసం బ్యాంకులకు వెళ్తున్నా సకాలంలో అందడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు అత్యవసర వైద్య సేవలకు రోగులు అవస్థలు పడుతున్నారు. పరకాల, నర్సంపేటలో ఉన్న మొత్తం 12 ఏటీఎంల్లో 3 మాత్రమే పని చేస్తుండడంతో అక్కడి ప్రజలు నగదు కోసం వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంబంధిత బ్యాంకు అధికారులు తక్షణమే స్పందించి ఏటీఎం సెంటర్లలో డబ్బులు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ఖాతాదారులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు