ఎనీ టైం నో క్యాష్‌

17 Mar, 2017 02:44 IST|Sakshi
ఎనీ టైం నో క్యాష్‌

ఏటీఎంలలో నగదు కొరత
15 రోజులుగా నిలిచిన డబ్బుల సరఫరా
అవస్థలు పడుతున్న ప్రజలు


నిజామాబాద్‌అర్బన్‌: నోట్ల కష్టాలు మళ్లీ తీవ్రమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఏటీఎంలలో ‘నో క్యాష్‌’ బోర్డులు దర్శనిమిస్తున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. 15 రోజులుగా డబ్బుల సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు నగదు కోసం అవస్థలు పడుతున్నారు. రిజర్వు బ్యాంకు నుంచి డబ్బుల సరఫరా నిలిచిపోవడంతో ఏటీఎంలలో డబ్బులు అందుబాటులో ఉండడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 366 బ్యాంకులు ఉండగా వీటి పరిధిలో 392 ఏటీఎంలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఏటీఎంలలో డబ్బులు అందుబాటులో లేకపోవడంతో మూసి ఉంచుతున్నారు. కొన్ని రోజులుగా ఏటీఎంలు పనిచేయకపోవడంతో ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.

బ్యాంకుల్లో నగదు డ్రా చేసుకుంటున్నారు. దీనికి కూడా అధికారులు పరిమితిలోపే నగదును ఇస్తున్నారు. ఖాతాదారులు బ్యాంకుల్లో జమ చేసిన డబ్బులనే ఇతర ఖాతాదారులకు అందజేస్తున్నారు. రెండు జిల్లాలకు ఆర్‌బీఐ నుంచి సుమారు ప్రతినెలా రూ. 186 కోట్ల రూపాయలు అందిస్తున్నారు. వీటి ద్వారానే ఏటీఏంలు, లావాదేవీలు కొనసాగుతాయి. కానీ డబ్బుల సరఫరా నిలిచిపోవడంతో అవస్థలు మొదలయ్యాయి. బ్యాంకులు చాలా చోట్ల ఏటీఎంలను మూసేస్తున్నాయి. ఫిబ్రవరి చివరి రోజుల్లో ఈ అవస్థలు మొదలు కాగా ప్రస్తుతం మరింత తీవ్రమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా బ్యాంకుల్లోనూ నగదు ఇవ్వడంలేదు. జమ చేయడం తప్ప విత్‌ డ్రాకు అనుమతి ఇవ్వడం లేదు. నగదు విత్‌ డ్రాలో పరిమితులు విధిస్తున్నారు. అడిగిన దాని కంటే తక్కువగా డబ్బులు అందిస్తున్నారు. ప్రస్తుతం మార్చి నెల కావడంతో లావాదేవీలు అధికంగా ఉంటాయి.

ఈ తరుణంలో నగదు కొరత ఇబ్బందికరంగా మారింది. ఆర్‌బీఐ నుంచి డబ్బులు సరఫరా అయితే తప్పా సమస్య కొలిక్కివచ్చే అవకాశం లేదు. నిజామాబాద్‌ బస్టాండ్‌ వద్ద ఉన్న రెండు ప్రధాన బ్యాంకుల శాఖల ఏటీఎంలు వెలవెలబోతున్నాయి. ప్రైవేటు బ్యాంకుల ఏటీఎంలలో కూడా నగదు అందుబాటులో లేదు. ప్రస్తుతం శుభకార్యాలు ఉండడంతో డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసరం ఉన్న వారు సైతం బ్యాంకుల చుట్టూ డబ్బుల కోసం తిరుగుతున్నారు.

తగ్గిన నగదు రహిత లావాదేవీలు
గతేడాది నవంబర్‌ 8న కేంద్రప్రభుత్వం ప్రకటించిన పెద్ద నోట్లరద్దు తర్వాత జిల్లాలో నగదు రహిత లావాదేవీలు పెంచాలని ఆదేశించారు. ఈ మేరకు అధికారులు నగదు రహిత లావాదేవీలపై విస్తృత ప్రచారం చేపట్టారు. అప్పట్లో కొనుగోళ్లు, అమ్మకాల్లో నగదు రహిత లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. అనంతరం కొత్తనోట్లు మార్కెట్‌లోకి అందుబాటులోకి రావడంతో క్రమేపీ నగదు రహిత లావాదేవీలు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం నగదు రహిత లావాదేవీలు తగ్గిపోవడం, కొత్తనోట్ల సరఫరా ఆగిపోవడంతో ఇబ్బందులు తల్తెతున్నాయి.

మరిన్ని వార్తలు