చావు కథ..శ్మశాన వ్యథ!

21 Aug, 2017 03:11 IST|Sakshi
చావు కథ..శ్మశాన వ్యథ!

► కట్టెకాలాలంటే.. అష్టకష్టాలే..  
►  దశాబ్దాలుగా వేధిస్తున్న వైనం
► శ్మశానవాటిక స్థలం లేక గోళ్లమూడి వాసుల అవస్థలు
► అన్ని వర్గాలదీ ఇదే పరిస్థితి  
► ఏటికి వరదొస్తే శవాన్ని పడవలో   తరలించాల్సిందే..

మరణం.. బంధాలను వీడి.. బాధను మిగిల్చే క్షణం. పుట్టినవాడు గిట్టకమానడు.. మరణించిన వేళ కన్నీటిధారతో  అశ్రునివాళి అర్పిస్తాం. ఇది బతుకున్న అందరూ సాగించే క్రతువే. ఓ గ్రామంలో మాత్రం వర్షాకాలంలో ఎవరైనా మరణిస్తే.. గిట్టిన వారిని తలచుకుని పడే బాధకంటే.. దహనసంస్కారాల కోసం పడే వేదనే ఎక్కువగా ఉంటోంది. శ్మశానవాటిక లేక దశాబ్దాలుగా ఆ ఊరి జనం పడుతున్న ఆవేదన వర్ణనాతీతం. ఎప్పటికి ఈ బాధ తీరేనో.. వేదన వీడేనో వేచిచూడాలి. 

నందిగామ :  ఆ గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందినా కట్టె కాలేందుకు అడుగు భూమి లేని దుస్థితి. మృతదేహాన్ని కాల్చాలన్నా, పూడ్చాలన్నా.. సంబంధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఎదుర్కొనే కష్టాలు అన్నీ..ఇన్నీ కావు. శవాన్ని భుజాన వేసుకొని దారి కూడా సక్రమంగా లేని మార్గంలో నరక యాతన పడాల్సిన దుస్థితి. ఈ దుస్థితి ఏ ఒక్క వర్గానికో పరిమితం కాలేదు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు.. ఇలా అందరికీ బాధలు తప్పడం లేదు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ సమస్య గ్రామస్తులను వెంటాడుతూనే ఉంది. నందిగామ మండల పరిధిలోని గోళ్లమూడి గ్రామస్తుల దీనావస్థ ఇది.

ఏరే శ్మశానవాటిక  
గ్రామంలో హిందువులకు శ్మశానవాటిక కోసం ఎటువంటి స్థలం లేదు. గ్రామంలో మహాప్రస్థానం లేకపోవడంతో కట్టెకాలాలంటే సమీపంలోని వైరా ఏరుకు వెళ్లాల్సిందే. ఏటి ఒడ్డునే దహన సంస్కారాలు నిర్వహిస్తుంటారు. అయితే వర్షాకాలం వచ్చిందంటే వారి కష్టాలు పగోడికి కూడా రాకూడదనిపిస్తుంది. ఏటికి నీరొస్తే ఏకంగా పడవలో వెళ్లి దహన సంస్కారాలు నిర్వహించాలి. కాడితో శవాన్ని మోసుకొచ్చి పడవలో ఇసుక దిబ్బను అన్వేషిస్తూ వెళ్లి ఎక్కడ ఒడ్డు కనిపిస్తే అక్కడ దహన సంస్కారాలు నిర్వహించి తిరిగి గ్రామానికి చేరుకోవాల్సిందే.

ముస్లింలు మరో ఊరు వెళ్లాల్సిందే..
హిందువుల పరిస్థితి ఇలా ఉంటే, ముస్లిం సోదరుల దుస్థితి మరింత దయనీయం. వీరి మతాచారం ప్రకారం శవాన్ని పూడ్చి పెట్టాల్సిఉంటుంది. ఇందుకోసం గ్రామంలో ఎటువంటి స్థలం లేకపోవడంతో ఏకంగా మూడున్నర కిలోమీటర్లు ప్రయాణించి రుద్రవరం గ్రామానికి చేరుకొని అక్కడ ఖననం చేయాల్సి వస్తోంది. ప్రభుత్వ పెద్దలు స్పందించి శ్మశానవాటిక కోసం స్థలం కేటాయించాలని కోరుతున్నారు.

స్థలం ఉన్నా తొలగని కష్టాలు
గ్రామంలో వైరా ఏటి ఒడ్డున ఉన్న స్థలాన్ని క్రైస్తవులు శ్మశానవాటికగా  వినియోగించుకుంటున్నారు. అయితే, ఈ స్థలంలో అధిక శాతం కోతకు గురైంది. ఇక అక్కడకు వెళ్లేందుకు సరైన దారి కూడా లేకపోవడంతో వారికి సైతం కష్టాలు తప్పడం లేదు.

ప్రభుత్వం స్థలం కొనుగోలు చేసి ఇవ్వాలి
గ్రామంలో శ్మశానవాటిక స్థలం లేకపోవడం వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి కనీసం రెండు ఎకరాల స్థలం కేటా యిస్తే, అందరికీ మేలు జరుగుతుంది. వర్షాకాలం లో మా కష్టాలు వర్ణనాతీతం – గాదెల వెంకటేశ్వరరావు(బాబు),  గోళ్లమూడి   

ఎవరైనా చనిపోతే మా పరిస్థితి దారుణం
వర్షాకాలం వచ్చిందంటే మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించడం ఓ ప్రహసనంగా మారుతోంది. వైరా ఏటికి వరద వస్తే మరింత దయనీయంగా ఉంటోంది. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి శవాన్ని దహనం చేయాల్సివస్తోంది.  
–సూర్యదేవర సూర్యనారాయణ, గోళ్లమూడి

ఉన్న స్థలాన్ని అందరూ ఉపయోగించుకోవచ్చు
గ్రామంలోని అన్ని వర్గాల వారు వినియోగించుకునేందుకు సర్వే నంబరు 162లో 1.53 ఎకరాల స్థలం ఉంది. ఇందులో కొంత  కోతకు గురైనా, ఇంకా 73 సెంట్ల స్థలం ఉంది. దారి కోసం రైతుల వద్ద నుంచి దాదాపు 60 సెంట్ల స్థలం సేకరించాం. దీని అభివృద్ధికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపాం. అన్ని వర్గాల వారు ఈ స్థలాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటాం.   – శ్రీరామకృష్ణ, తహసీల్దార్‌

మరిన్ని వార్తలు